స్కాట్లాండ్‌ బోణీ

  • నమీబియాపై అలవోక విజయం
  • ఎరాస్మస్‌ ఇన్నింగ్స్‌ వృథా

బార్బడోస్‌: ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా అర్ధాంతరంగా రద్దు అయినా రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ బోణీ కొట్టింది. గ్రూప్‌-బీలో భాగంగా బార్బడోస్‌ వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఆ జట్టును ఓడించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు సారథి గెర్హర్డ్‌ ఎరాస్మస్‌ (31 బంతుల్లో 52, 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకంతో ఆకట్టుకోగా వికెట్‌ కీపర్‌ జేన్‌ గ్రీన్‌ (28) ఆదుకున్నాడు.

స్కాట్లాండ్‌ బౌలర్లలో బ్రాడ్‌ వీల్‌ (3/33), బ్రాడ్లీ క్యూరీ (2/16) నమీబియాను కట్టడిచేశారు. ఒమన్‌తో మ్యాచ్‌లో సమిష్టిగా రాణించిన నమీబియా.. స్కాట్లాండ్‌తో మాత్రం చేతులెత్తేసింది. స్వల్ప ఛేదనను స్కాట్లాండ్‌ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి పూర్తిచేసింది. రిచీ బెర్రింగ్టన్‌ (35 బంతుల్లో 47 నాటౌట్‌, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ ఆడగా మైకెల్‌ లీస్క్‌ బ్యాట్‌ (17 బంతుల్లో 35, 4 సిక్సర్లు)తో పాటు బంతి (1/16) రాణించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అందుకున్నాడు.

సంక్షిప్త స్కోర్లు

నమీబియా: 20 ఓవర్లలో 155/9 (ఎరాస్మస్‌ 52, గ్రీన్‌ 28, వీల్‌ 3/33, కరీ 2/16).

స్కాట్లాండ్‌: 18.3 ఓవర్లలో 157/5 (బెర్రింగ్టన్‌ 47 నాటౌట్‌, లీస్క్‌ 35, ఎరాస్మస్‌ 2/29, బెర్నార్డ్‌ 1/20)

2024-06-07T20:27:33Z dg43tfdfdgfd