మాట్లాడలేకపోతున్నా, సూపర్-8 చేరతామో లేదో దేవుడికే తెలియాలి: పాక్ మాజీ క్రికెటర్

t20 world cup 2024టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచులో పాకిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఓ దశలో ఈజీగా గెలిచేలా కనిపించిన పాకిస్థాన్.. అనూహ్యంగా తడబడింది. చివరి 48 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన దశలో చేతిలో 8 వికెట్లు ఉన్నా గెలుపు గీతను దాటలేకపోయింది. దీంతో ఆ జట్టు ఫ్యాన్స్‌తో పాటు.. మాజీ క్రికెటర్లు సైతం తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

ఇదే విషయంపై పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండీ ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ స్పందించాడు. గెలిచే మ్యాచులో ఓడిపోవడంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ""చాలా విషయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇది జట్టుకు నిజంగా బాధాకరం. ఈ మ్యాచ్ లో పాక్ గెలిచి ఉండాల్సింది. ఫకర్ జమాన్ క్రీజులో ఉన్నప్పుడు 47 బంతుల్లో 46 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు ఉన్నా చేయలేకపోయాం. నేను మాట్లాడలేకపోతున్నాను. దేశం మొత్తం బాధలో ఉంది. వ్యక్తిగత లక్ష్యం ముఖ్యం కాదని ఆట ప్రారంభంలోనే చెప్పాను. ఒకరి కోసం ఒకరు ఆడాలి, దేశం కోసం ఆడాలి" అని పాకిస్థాన్ ప్లేయర్లపై అక్తర్ విమర్శలు గుప్పించాడు.

"మ్యాచ్ గెలవాలనే పట్టుదలను ప్రదర్శించాలి. 1000 పరుగులు, 4000 లేదా 10000 కెరీర్ పరుగులు వంటి వ్యక్తిగత మైలురాళ్లు ముఖ్యం కాదు. పాకిస్థాన్ సూపర్-8 అర్హత సాధిస్తుందా లేదా అన్నది అనుమానంగా మారింది. అది దేవుడికి తెలుసు" అని షోయబ్ అక్తర్ చెప్పుకొచ్చాడు.

కాగా భారత్‌ చేతిలో ఓడిపోవడంపై పాకిస్థాన్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. వాస్తవానికి భారత్ 119 పరుగులకే ఆలౌట్ అయినప్పుడు ఈజీగా గెలుస్తామని పాక్ ఫ్యాన్స్ భావించారు. తీరా బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. ఫలితంగా టోర్నీలో వరుసగా రెండో మ్యాచులో ఓడిపోయిన పాకిస్థాన్.. సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికలో నాలుగో ప్లేసులో నిలిచింది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచిన భారత్, అమెరికాలో తొలి రెండు ప్లేసుల్లో ఉన్నాయి. అమెరికా తన తర్వాతి మ్యాచులో భారత్, ఐర్లాండ్‌తో తలపడనుంది. ఇందులో ఒక్క మ్యాచులో ఆ జట్టు గెలిచినా.. పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-10T06:27:32Z dg43tfdfdgfd