భారత్ చేతిలో ఓటమి.. గ్రౌండ్‌లోనే ఏడ్చేసిన పాక్ పేసర్..!

టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచులో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. క్రికెట్‌ అభిమానులకు అసలైన మజాను అందిస్తూ.. థ్రిల్లింగ్ మ్యాచులో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించిన ఈ మ్యాచులో.. 119 పరుగులను సైతం భారత్ కాపాడుకుంది. ఓటమి తప్పదనుకున్న దశ నుంచి బలంగా పుంజుకుని గెలుపు గీతను దాటింది.

అయితే గెలిచే మ్యాచులో ఓడటం, ముఖ్యంగా భారత్ గెలుపును జీర్ణించుకోలేకపోయిన పాకిస్థాన్ స్టార్ 21 ఏళ్ల పేసర్ నసీమ్ షా.. గ్రౌండ్‌లోనే ఏడ్చేశాడు. మ్యాచ్ చివరి వరకూ క్రీజులో ఉన్న నసీమ్ షా.. డకౌట్‌లోకి వెళ్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరో బౌలర్ షాహీన్ షా అఫ్రిది అతడిని ఓదార్చేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

కాగా ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌ చేసిన భారత్.. 119 పరుగులకే కుప్ప కూలింది. కానీ 20 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. దీంతో తాము ఈజీగా గెలిచినట్లే అని పాకిస్థాన్ ప్లేయర్లు భావించారు. అందుకే వికెట్ పడ్డ ప్రతీసారి అతిగా సంబురాలు చేసుకున్నారు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో గానీ వారికి నిజం తెలిసిరాలేదు. రోహిత్, విరాట్ లాంటి అత్యుత్తమ క్రికెటర్లు ఉన్న భారతే.. 119 పరుగులకు పరిమితం అయినప్పుడు తమ పరిస్థితి ఎలా ఉంటుందనే తొలుత పాక్ ఊహించలేదు.

చేసింది 119 పరుగులే అయినా.. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది భారత్. అనుకున్నట్లుగానే పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచింది. నిదానంగా ఆడినప్పటికీ ఓపెనర్ రిజ్వాన్.. చివరి వరకు క్రీజులో ఉండాలని భావించాడు. దీంతో పాకిస్థాన్ విజయానికి చివరి 8 ఓవర్లలో 48 పరుగులు అవసరమయ్యాయి. చేతిలో 8 వికెట్లు ఉండటంతో ఈజీగా గెలుస్తామని పాక్ శిబిరంలో సంతోషం కనిపించింది. కానీ ఈ సమయంలోనే భారత బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు తీసి.. పాకిస్థాన్ 113/7కు పరిమితం చేశారు. దీంతో ఆరు పరుగుల తేడాతో టీమిండియా జయకేతనం ఎగురవేసింది. టీ20 ప్రపంచకప్‌లలో ఆరోసారి ఆ జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-10T05:57:23Z dg43tfdfdgfd