న్యూయార్క్‌ పిచ్‌పై క్యూరేటర్ కూడా గందరగోళంలో ఉన్నాడు: రోహిత్ శర్మ

టీ20 ప్రపంచకప్ 2024 కోసం న్యూయార్క్‌లో నిర్మించిన క్రికెట్ స్టేడియంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. టోర్నీ కోసం ప్రత్యేకంగా సుమారు వంద రోజుల్లోనే స్టేడియాన్ని రూపొందించింది ఐసీసీ. ఈ స్టేడియం చూసేందుకు బాగానే కనిపిస్తున్నా.. అనూహ్య బౌన్స్, నెమ్మదిగా ఉన్న ఔట్ ఫీల్డ్‌తో బ్యాటర్లకు ఇబ్బందికరంగా మారింది. ఈ టోర్నీలో భాగంగా ఈ వేదికపై భారత్-పాకిస్థాన్ మ్యాచుకు ముందు వరకు నాలుగు మ్యాచులు జరిగాయి. అందులో రెండు మ్యాచుల్లో వంద పరుగులు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అత్యధిక స్కోరు 137గా ఉంది.

ఇక ఈ స్టేడియంలో భారత్-ఐర్లాండ్ జట్లు తలపడ్డాయి. మ్యాచ్ సందర్భంగా బంతి అనూహ్యంగా బౌన్స్ కావడంతో కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. హాఫ్ సెంచరీ చేసిన తర్వాత రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అంతేకాకుండా ప్రాక్టీస్ సందర్భంగా కూడా ఆటగాళ్లు గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ పిచ్‌పై బీసీసీఐ.. ఐసీసీకి అనధికారికంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కాగా ఇవాళ జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సైతం ఇదే స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో మ్యాచుకు ముందు మాట్లాడిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"న్యూయార్క్ మా హోంగ్రౌండ్ కాదు. మేం ఇక్కడ రెండు మ్యాచులు (బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్, ఐర్లాండ్‌తో మ్యాచ్) ఆడాం. కానీ ఈ పిచ్ గురించి మాకు పెద్దగా అవగాహన లేదు. ఇది భిన్నంగా ప్రవర్తిస్తోంది. మాకే కాదు.. ఈ పిచ్ గురించి క్యూరేటర్ కూడా గందరగోళంలోనే ఉన్నాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్.. మేం ఏ పిచ్‌పై ఆడతామో తెలీదు. ఏది ఏమైనా మెరుగైన క్రికెట్ ఆడిన వారే విజేతగా నిలుస్తారు"

"ఈ స్టేడియం ఔట్ ఫీల్డ్ నెమ్మదిగా ఉంది. కాబట్టి వికెట్ల మధ్య పరుగులు తీయడం ముఖ్యం. పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సి ఉంటుంది. ప్లేయర్లంతా తమ అనుభవాన్ని బయటకు తీయాల్సి ఉంటుంది" అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా న్యూయార్క్ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచుకు ముందు నాలుగు మ్యాచులు జరిగాయి. అందులో ఒక్కదాంట్లో కూడా 140 పరుగుల నమోదు కాకపోవడం గమనార్హం. తొలి మ్యాచ్‌లో శ్రీలంక 77 పరుగులకు ఆలౌట్‌ కాగా.. 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని ఛేదించింది. భారత్‌-ఐర్లాండ్‌ మ్యాచ్‌లోనూ వందలోపే స్కోర్లు నమోదయ్యాయి. ఐర్లాండ్‌ నిర్దేశించిన 97 పరుగుల లక్ష్యాన్ని భారత్‌.. 12.2 ఓవర్లలో ఛేజ్‌ చేసింది. మూడో మ్యాచ్‌లో కెనడా 137 పరుగులు చేయగా.. ఐర్లాండ్‌ 125కే పరిమితమైంది. శనివారం జరిగిన మ్యాచులో నెదర్లాండ్స్ నిర్దేశించిన 104 పరుగుల లక్ష్యాన్ని ఛేజించేందుకు దక్షిణాఫ్రికా 18.5 ఓవర్లు తీసుకుంది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-09T08:09:07Z dg43tfdfdgfd