టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ పోరు.. చరిత్ర ఏం చెబుతోందంటే..!

టీ20 ప్రపంచకప్ 2024 పుణ్యమా అని భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్‌ను మరోసారి చూసే ఛాన్స్ ఫ్యాన్స్‌కు దక్కింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలతో కొన్నేళ్లుగా కేవలం ఐసీసీ టోర్నీలు, ఆసియాకప్‌లలో మాత్రమే దాయాదుల పోరు జరుగుతోంది. అందుకు అనుగుణంగా ఐసీసీ కూడా టోర్నీ లీగ్ దశలోనే భారత్-పాకిస్థాన్ జట్లు తలపడేలా షెడ్యూల్ చేస్తోంది. ఈ సారి కూడా అదే జరిగింది. న్యూయార్క్ వేదికగా ఆదివారం రాత్రి 8 గంటలకు భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అయితే టీ20 ప్రపంచకప్‌లలో భారత్-పాకిస్థాన్ జట్లు ఎన్నిసార్లు తలపడ్డాయి. ఎవరు పైచేయి సాధించారు?

టీ20 ప్రపంచకప్ 2007- బౌలౌట్:

టీ20 ప్రపంచకప్‌ను తొలిసారి 2007లో నిర్వహించారు. దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా దాయాదుల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఇరు జట్ల స్కోర్లు (141) సమం కావడంతో బౌలౌట్ ద్వారా విజేతను నిర్ణయించారు. టీమిండియా ప్లేయర్లు రాబిన్ ఉతప్ప, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్‌లు వికెట్లను పడగొట్టారు. పాక్ బౌలర్లు వేసిన బంతి ఒక్కసారి కూడా వికెట్లను తాగకపోవడంతో భారత్ విజేతగా నిలిచింది.

టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్:

టోర్నీ ఆరంభ సీజన్‌లోనే భారత్-పాక్ జట్లు రెండు సార్లు తలపడ్డాయి. లీగ్ దశతో పాటు.. ఫైనల్‌లోనూ ఈరెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. భారత్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో పాక్‌కి చివరి ఓవర్లో 13 రన్స్ అవసరమయ్యాయి. కెప్టెన్ ధోనీ చివరి ఓవర్‌ను జోగిందర్ శర్మకు ఇవ్వడం.. మిస్బా ఉల్ హక్ స్కూప్ షాట్ కొట్టడం.. బంతి వెళ్లి శ్రీశాంత్ చేతిలో పడటం.. విజయోత్సాహంలో భారత్ క్రికెటర్లు స్టేడియంలోకి దూసుకురావడం సదరు క్రికెట్ అభిమానికి ఇప్పటికి గుర్తుండే ఉంటుంది. ఈ మ్యాచులో భారత్ 5 పరుగుల తేడాతో గెలిచి విజేతగా నిలిచింది.

టీ20 ప్రపంచకప్ 2012:

2007 ఫైనల్ తర్వాత భారత్ పాక్ జట్లు మళ్లీ ఈ టోర్నీలో తలపడేందుకు ఐదేళ్లు పట్టింది. 2012 టోర్నీలో జరిగిన మ్యాచులో టీమిండియా.. పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. భారత బౌలర్ల దెబ్బకు పాక్ 128 పరుగులకే కుప్పకూలింది. 78 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విరాట్.. జట్టుకు విజయాన్ని అందించాడు.

టీ20 ప్రపంచకప్ 2014:

ఈ మ్యాచులో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. 130 పరుగులకు పరిమితమైంది. అనంతరం విరాట్ కోహ్లీ (36), సురేశ్ రైనా (35), శిఖర్ ధావన్ (30) రాణించడంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

టీ20 ప్రపంచకప్ 2016:

భారత్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో కోల్‌కతా వేదికగా దాయాదుల మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఫస్టు బ్యాటింగ్ చేసిన పాక్.. 118 పరుగులకే పరిమితమైంది. విరాట్ కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియా మరో 25 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో పాకిస్థాన్‌పై వరుసగా ఐదో విజయాన్ని నమోదు చేసింది.

టీ20 ప్రపంచకప్ 2021:

ఈ టోర్నీ ద్వారా పొట్టి ప్రపంచకప్‌లో పాక్‌పై భారత జైత్రయాత్రకు బ్రేక్ పాడింది. ఈ మ్యాచులో ఫస్టు బ్యాటింగ్ చేసిన భారత్.. 151 పరుగులు చేసింది. షాహీన్ అఫ్రిద్ తన బౌలింగ్‌తో భారత బ్యాటర్లను బెంబేలెత్తించాడు. అనంతరం పాకిస్థాన్ ఓపెనర్లు మహమ్మద్ రిజ్వాన్ (79), బాబర్ ఆజ్మ్ (68) మ్యాచును ఫినిష్ చేశారు. భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

టీ20 ప్రపంచకప్ 2022:

రెండేళ్ల కిందట మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌.. ఉత్కంఠను తారాస్థాయికి తీసుకెళ్లింది. ఓటమి తప్పదనుకున్న దశలో విరాట్ కోహ్లీ గొప్పగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించాడు. అజేయంగా 82 పరుగులు చేసి.. ఉత్కంఠ పోరులో జట్టును గెలిపించాడు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-09T10:54:32Z dg43tfdfdgfd