అయ్యో పాకిస్థాన్.. సూపర్‌-8కు చేరాలంటే అదృష్టం తలుపుతట్టాల్సిందే..!

టీ20 ప్రపంచకప్‌ 2024లో ఫైనల్‌ చేరే జట్లలో చాలా మంది విశ్లేషకులు పాకిస్థాన్‌ పేరును చెప్పారు. పేపర్‌పై ఆ జట్టు బలంగా ఉందని.. టోర్నీలోనూ రాణిస్తుందని విశ్లేషించారు. గ్రూప్‌-ఏలో భారత్‌తో పాటు పాకిస్థాన్‌ కూడా సూపర్‌-8కు చేరుతుందని అంచనా వేశారు. కానీ ఇదంతా టోర్నీ ప్రారంభానికి ముందు మాట. ప్రస్తుతం సీన్‌ రివర్స్‌ అయింది. సెమీఫైనల్‌ సరికదా.. ఆ జట్టు కనీసం సూపర్‌-8 ఐనా చేరుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. టోర్నీలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిన పాక్.. సూపర్‌-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచిన భారత్.. దాదాపుగా సూపర్‌-8 చేరినట్లే..!

ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టు.. అమెరికాతో తలపడింది. ఆ జట్టు గొప్పగా పోరాడటంతో మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. అక్కడ కూడా మెరుగైన ప్రదర్శన చేసిన ఆతిథ్య యూఎస్‌ఏ పాక్‌కు షాక్‌ ఇచ్చింది. తాజాగా ఆదివారం భారత్‌తో జరిగిన మ్యాచులోనూ పాకిస్థాన్‌ ఓటమిపాలైంది. ఓ దశలో ఈజీగా గెలిచేలా కన్పించినా.. అనూహ్యంగా 6 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఫలితంగా పాకిస్థాన్‌ సూపర్-8లో క్వాలిఫై అయ్యే అవకాశాలు స‌న్నగిల్లాయి. ఇప్పుడు ఆ జట్టు తదుపరి దశకు అర్హత సాధించాలంటే.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పాక్‌ సూప‌ర్‌-8 చేరాలంటే..

టీ20 ప్రపంచకప్‌ 2024లో గ్రూప్‌-ఏలో ఉన్న పాకిస్థాన్‌కు మ‌రో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఆ జట్టు జూన్ 11న కెన‌డా, జూన్‌ 16న ఐర్లాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో ప్లేసులో ఉన్న బాబర్‌ సేన.. సూప‌ర్‌-8కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయం సాధించాలి. మైనస్‌లలో ఉన్న రన్‌రేటులో మెరుగుపర్చుకోవాలి. మ‌రోవైపు పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో ప్లేసులో ఉన్న అమెరికా.. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోవాలి. దీంతో చెరో నాలుగు పాయింట్లతో పాకిస్థాన్, అమెరికాలు నిలుస్తాయి. అప్పుడు నెట్‌రన్‌రేట్‌ మెరుగ్గా ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. అలా కాకుండా అమెరికా ఒక్క మ్యాచ్‌లో గెలిచినా పాక్ ఇంటిముఖం ప‌ట్ట‌క త‌ప్ప‌దు. అమెరికా తన తర్వాతి మ్యాచుల్లో భారత్‌, ఐర్లాండ్‌తో తలపడనుంది. పాకిస్థాన్‌ తన తర్వాతి మ్యాచుల్లో కెనడా, ఐర్లాండ్‌తో ఢీకొట్టనుంది.

కాగా టోర్నీలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచిన భారత్.. సూపర్‌-8 చేరినట్లే. మిగిలిన రెండు మ్యాచుల్లో కనీసం ఒక్కదాంట్లో గెలిచినా.. టీమిండియా ముందంజ వేస్తుంది. భారత్ తన తర్వాతి మ్యాచుల్లో యూఎస్‌ఏ, కెనడాతో తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లో భారత్‌ గెలవడం ఖాయం! గ్రూప్‌-ఏలో భారత్‌తో పాటు సూపర్‌-8కు చేరే మరో జట్టేదో తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-10T16:14:00Z dg43tfdfdgfd