ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కు మరికొన్ని గంటలే సమయం ఉంది. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా దాయాదుల సమరం ఉండనుంది. భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. అమెరికా చేతిలో అనూహ్య ఓటమితో షాక్‌లో ఉన్న పాకిస్థాన్ ఈ మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవాలనే పట్టుదలతో ఉంది.
ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టు ఎంపిక ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. గత మ్యాచ్‌లో టీమిండియా స్పెషలిస్టు స్పిన్నర్ లేకుండానే బరిలోకి దిగింది. పిచ్ పేసర్లకు అనుకూలించడంతో అది సత్ఫలితాన్ని ఇచ్చింది. కానీ ఐర్లాండ్‌తో పోలిస్తే పాకిస్థాన్‌లో స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే బ్యాటర్లు ఉన్నారు. దీంతో వారికి చెక్ పెట్టాలంటే స్పెషలిస్టు స్పిన్నర్ అవసరమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీంతో పాక్‌తో మ్యాచ్‌కు తుది జట్టులో భారత్ కనీసం ఒక మార్పు చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
అక్షర్ పటేల్ లేదా మహమ్మద్ సిరాజ్ ప్లేసులో కుల్‌దీప్ యాదవ్‌ను ప్లేయింగ్ లెవెన్‌లో ఆడించే అవకాశం ఉంది. చైనామన్ బౌలింగ్‌తో బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టే కుల్‌దీప్.. పాకిస్థాన్‌పై కూడా చెలరేగుతాడని టీమిండియా యాజమాన్యం భావిస్తోంది. దీంతో పిచ్ పరిస్థితిని బట్టి అక్షర్ పటేల్ లేదా సిరాజ్ ప్లేసులో అతడు జట్టులోకి రానున్నాడు! గత మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క ఓవర్ వేశాడు అక్షర్. బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఈ ఒక్క మార్పు మినహా టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు.
ఇక పాకిస్థాన్ విషయానికి వస్తే ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌తో పాటు ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో విఫలమైన వికెట్ కీపర్ ఆజమ్ ఖాన్‌పై వేటు వేసే అవకాశం ఉంది. అతడి ప్లేసులో సైమ్ అయూబ్‌కు తుది జట్టులో ఛాన్స్ దక్కొచ్చు.