Yuvraj Singh : భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) తండ్రి యోగ్‌రాజ్ సింగ్(Yograj Singh) ఎంఎస్ ధోనీపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడి అంతర్జాతీయ కెరీర్‌ను జీవితాన్ని ధోనీ సర్వ నాశనం చేశాడని యోగ్‌రాజ్ ఓ వీడియోలో అన్నాడు. ఆయన ఆరోపణల నేపథ్యంలో యూవీ తన తండ్రి గురించి మాట్లాడిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతుంది. అందులో యువరాజ్.. మా నాన్న మానసిక సమస్యలతో బాధ పడుతున్నాడని చెప్పాడు.
టీమిండియా వరల్డ్ కప్ హీరోగా కెరీర్ ముగించిన యువరాజ్ నిరుడు ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. ‘మా నాన్నా యోగిరాజ్ మానసిక సమస్యలతో బాధ పడుతున్నాడు. అయితే.. ఈ విషయాన్ని ఆయన అస్సలు అంగీకరించడు’ అని యువరాజ్ ఈ వీడియోలో వెల్లడించాడు. ఈ వీడియో చూసిన వాళ్లతా ‘అవునా.. అందుకనే ధోనీపై యోగిరాజ్ అభ్యంతరకరమైన ఆరోపణలు చేశాడా?’ అని కామెంట్లు పెడుతున్నారు.
తన కుమారుడు యువరాజ్‌కు భారత రత్న అవార్డు ఇవ్వాలని యోగిరాజ్ ఓ వీడియోలో డిమాండ్ చేశాడు. అదే సమయంలో ఆయన ఎంఎస్ ధోనీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. ‘నా కుమారుడు యువరాజ్ సింగ్ జీవితాన్ని ధోనీ నాశనం చేశాడు. తానే ఏం చేశాడనేది అద్ధంలో ముఖం చూసుకుంటే అతడికే అర్థమవుతుంది. నేను అయితే ధోనీని ఎప్పటికీ క్షమించను. అతడు గొప్ప అటగాడే. కానీ నా కొడుకు యూవీ కెరీన్‌ను దెబ్బతీశాడు. ఒకవేళ ధోనీ గనుక అడ్డు లేకుంటే నా బిడ్డ మరో నాలుగైదు ఏండ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడేవాడు’ అని యోగ్‌రాజ్ జీ స్విచ్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అవేశంగా అన్నాడు.
టీమిండియా 2022లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యుడైన యూవీ.. ఆ తర్వాత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఐసీసీ తొలిసారి ప్రవేశ పెట్టిన టీ20 వరల్డ్ కప్ విజయంలో యువరాజ్ పాత్ర మరువలేనిది. కీలక పోరులో ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్లో ‘ఆరు’ సిక్సర్లతో గర్జించిన యూవీ.. ఆల్‌రౌండర్‌గానూ అదరగొట్టాడు. దాంతో ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు విశ్వ విజేతగా అవతరించింది.
ఆ తర్వాత 2011 వరల్డ్ కప్‌లోనూ యూవీ తన మార్క్ ఆటతో విజృంభించాడు. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రక్తం కక్కుతూనే అర్ధ సెంచరీతో జట్టును గెలిపించాడు. యువరాజ్ తన 17 ఏండ్ల(2000 నుంచి 2017) కెరీర్‌లో 402 మ్యాచ్‌ల ఆడాడు. 17 సెంచరీలు, 71 అర్ధ శతకాలతో రాణించాడు.
టీమిండియా ఆల్‌రౌండర్‌గా యువరాజ్.. ఫినిషర్‌గా ధోనీలు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడారు. మైదానంలో వీళ్లిద్దరూ గొడవపడిన సందర్భాలు అయితే కనిపించలేదు. అయితే.. 2011లో ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer) కారణంగా ఆటకు బ్రేక్ ఇచ్చిన యూవీ.. కీమోథెరపీ తర్వాత త్వరగా కోలుకున్నాడు. మళ్లీ బ్యాటు అందుకున్న యూవీ మునపటిలా చెలరేగిపోయాడు.