VARUN CHAKARAVARTHY | వరుణ్‌ చక్రవర్తికి బీసీసీఐ పిలుపు.. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక..!

Varun Chakaravarthy | ఇంగ్లాండ్‌తో జరుగనున్న మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు భారత జట్టులో స్టార్‌ లెగ్‌ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తికి చోటు దక్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో వరుణ బౌలింగ్‌తో అదరగొట్టాడు. వరుణ్‌ 9.85 సగటుతో 14 వికెట్లు పడగొట్టి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్‌ బ్యాటర్స్‌ను ముప్పుతిప్పలు పెట్టిన వరుణ్‌కు వన్డేల్లోనూ ఛాన్స్‌ ఇచ్చింది. టీ20 సిరీస్‌ను టీమిండియా 4-1 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా మూడు మ్యాచుల వన్డే సిరీస్‌పై దృష్టి సారించింది. తొలి మ్యాచ్‌ ఈ నెల 6న నాగ్‌పూర్‌ వేదికగా జరుగనున్నది.

ఈ మ్యాచ్‌ కోసం రోహిత్‌ శర్మ నేతృత్వంలోని భారత జట్టు విదర్భ క్రికెట్‌ అసోసియేషన్‌ స్టేడియానికి చేరుకుంది. మంగళవారం భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. వరుణ్ చక్రవర్తి నెట్స్‌లో బౌలింగ్‌ సాధన చేస్తూ కనిపించాడు. వరుణ్‌ ఇప్పటి వరకు భారత జట్టు తరఫున వన్డేలు ఆడలేదు. దేశవాళీ క్రికెట్‌లో 23 లిస్ట్‌ ఏ మ్యాచ్‌లు ఆడిన వరుణ్‌.. 4.28 ఎకానమీతో 59 వికెట్లు తీశాడు. ఇటీవల రాజ్‌కోట్‌లో వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తితో సహా ఐదుగురు స్పిన్నర్లకు బీసీసీఐ జట్టులో చోటు కల్పించింది.

ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.

2025-02-04T13:12:26Z