VAIBHAV SURYAVANSHI | ఇంగ్లండ్‌పై 52 బంతుల్లోనే సెంచరీ.. చరిత్ర సృష్టించిన వైభవ్..!

Vaibhav Suryavanshi : భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) మరోసారి చరిత్ర లిఖించాడు. పద్నాలుగేళ్లకే ఐపీఎల్‌లో 35 బంతుల్లోనే శతకంతో రికార్డులు నెలకొల్పిన ఈ చిచ్చరపిడుగు.. ఈసారి ఇంగ్లండ్‌పై తన ప్రతాపం చూపించాడు. అండర్ -19 జట్టు తరఫున ఆడుతున్న ఈ కుర్రాడు శుక్రవారం 52 బంతుల్లోనే సెంచరీతో చెలరేగాడు. నాలుగో వన్డే మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు బౌలర్లపై ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడిన వైభవ్ మూడంకెల స్కోర్‌తో గర్జించాడు.

ఐపీఎల్ 18వ సీజన్‌లో వేగవంతమైన సెంచరీతో వార్తల్లో నిలిచిన వైభవ్.. విదేశీ గడ్డపై కూడా పరుగుల వరద పారిస్తున్నాడు. ఇంగ్లండ్ అండర్ -19 జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ హిట్టర్ శుక్రవారం తన విధ్వంసాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ 52 బంతుల్లోనే శతకంతో తన సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చాటాడు. కేవలం 78 బంతుల్లోనే 143 రన్స్‌తో భారత్‌కు భారీ స్కోర్ అందించాడీ యువకెరటం. అతడి విధ్వంసానికి పాకిస్థాన్ బ్యాటర్ కమ్రాన్ గులామ్ పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

రెండో వేగ‌వంత‌మైన శ‌త‌కం

ప‌న్నెండు ఏళ్ల‌కే రంజీల్లో అరంగేట్రం చేసిన వైభ‌వ్‌ను మెగా వేల‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ సొంతం చేసుకుంది. రూ.1.5 కోట్ల‌కు రాజ‌స్థాన్ శిబిరంలో చేరిన ఈ కుర్రాడు త‌న బ్యాటింగ్‌ను సానబెట్టుకున్నాడు. కెప్టెన్ సంజూ శాంస‌న్ గాయప‌డ‌డంతో ల‌క్నోతో మ్యాచ్‌లో వైభ‌వ్‌కు ఓపెన‌ర్‌గా అవ‌కాశం వ‌చ్చింది. తొలి పోరులోనే 35 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్న ఈ చిచ్చ‌ర‌పిడుగు.. ఆ త‌ర్వాత గుజ‌రాత్ టైటాన్స్‌పై సెంచ‌రీతో గ‌ర్జించాడు. ఐపీఎల్ హిస్ట‌రీలోనే రెండో వేగ‌వంత‌మైన శ‌త‌కం న‌మోదు చేశాడు. బౌల‌ర్ మారినా బంతి గ‌మ్యం స్టాండ్స్‌లోకే అన్న‌ట్టు చెల‌రేగిన వైభ‌వ్.. 35 బంతుల్లోనే వందతో జైపూర్ ప్రేక్ష‌కుల‌కు సెల్యూట్ చేశాడు. అత‌డి విధ్వంస‌క ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 11 సిక్స‌ర్లు ఉండ‌డం విశేషం.

ఐపీఎల్‌లో వేగవంత‌మైన సెంచ‌రీ బాదిన వాళ్ల‌లో క్రిస్ గేల్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు ఆడుతున్న రోజుల్లో గేల్ 30 బంతుల్లోనే శ‌త‌క‌గ‌ర్జ‌న చేశాడు. 35 బంతుల్లోనే వంద కొట్టేసిన వైభ‌వ్ రెండో స్థానం సొంతం చేసుకున్నాడు. యూసుఫ్ ప‌ఠాన్, డేవిడ్ మిల్ల‌ర్‌లు కూడా ఫాస్టెస్ట్ సెంచ‌రీ వీరుల జాబితాలో ఉన్నారు.

1. క్రిస్ గేల్ (ఆర్సీబీ)- 30 బంతుల్లో -2013

2. వైభ‌వ్ సూర్య‌వంశీ(రాజ‌స్థాన్) – 35 బంతుల్లో – 2025

3. యూసుఫ్ ప‌ఠాన్ (రాజ‌స్థాన్) – 37 బంతుల్లో – 2010

4. డేవిడ్ మిల్ల‌ర్ (పంజాబ్ కింగ్స్) – 38 బంతుల్లో – 2013

ఇవి కూడా చదవండి

2025-07-05T12:55:49Z