US Open | న్యూయార్క్: యూఎస్ ఓపెన్‌లో సంచలనాల పర్వం కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జొకోవిచ్ మూడో రౌండ్‌లోనే ఇంటిబాట పట్టగా మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన కోకో గాఫ్ (యూఎస్‌ఏ) సైతం నాలుగో రౌండ్‌లోనే వెనుదిరిగింది. సోమవారం ఆర్థర్ ఆష్లే స్టేడియం వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో గాఫ్ 3-6, 6-4, 3-6తో ఎమ్మా నవర్రో (యూఎస్‌ఏ) చేతిలో పరాభవం పాలైంది. మ్యాచ్‌లో 19 డబుల్ ఫాల్ట్స్ చేసిన గాఫ్ అందుకు తగ్గ మూల్యం చెల్లించుకుంది. గాఫ్ 14 విన్నర్లే కొట్టగా ఎమ్మా 20 సాధించి యూఎస్ ఓపెన్‌లో తొలిసారి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. మరో పోరులో రెండో సీడ్ అరీనా సబలెంక 6-2, 6-4తో ఎలిస్ మెర్టెన్స్ (బెల్జియం)ను ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. చైనా అమ్మాయి కిన్వెన్ జెంగ్ 7-6 (7/2), 4-6, 6-2తో డొన వెకిచ్ (క్రొయేషియా)ను ఓడించింది. క్వార్టర్స్‌లో జెంగ్, సబలెంక తలపడనున్నారు.
పురుషుల సింగిల్స్‌లో అలగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), ఫ్రాన్సిస్ టియాఫో(యూఎస్‌ఏ), ఫ్రిట్జ్ (యూఎస్‌ఏ), దిమిత్రోవ్ (బల్గేరియా) క్వార్టర్స్ చేరారు. ప్రిక్వార్టర్స్‌లో టియాఫో.. 6-4, 7-6 (7/3), 2-6, 6-3తో పొపిరిన్ (ఆస్ట్రేలియా)ను ఓడించి వరుసగా రెండోసారి యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ చేరాడు. జ్వెరెవ్ 6-3, 1-6, 6-2, 6-2తో నకషిమ (యూఎస్‌ఏ)ను చిత్తుచేశాడు. క్వార్టర్స్‌లో జ్వెరెవ్-ఫ్రిట్జ్, దిమిత్రోవ్-టియాఫో తలపడనున్నారు. పురుషుల డబుల్స్‌లో బోపన్న (భారత్), ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం 1-6, 5-7తో మొల్టెనీ, గోంజాలెజ్ (అర్జెంటీనా) చేతిలో ఓడారు.
2024-09-02T23:33:59Z dg43tfdfdgfd