Travis Head : ఐసీసీ ఫైనల్స్‌లో ఎదురన్నదే లేని ఆస్ట్రేలియా(Australia) రికార్డు స్థాయిలో ఆరోసారి చాంపియన్‌గా అవతరించింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీతో ఓపెనర్ ట్రావిస్ హెడ్(Travis Head) మరోసారి హీరో అయ్యాడు. నాలుగు నెలల క్రితం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో(WTC Final 2023) భారత్‌పై శతకంతో గర్జించిన హెడ్.. వరల్డ్ కప్ ఫైనల్లోనూ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో, అతడిపై ఆస్ట్రేలియా మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సమయంలో ఆసీస్ దివంగత లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్(Shane Warne) ఏడేండ్ల కిందటి ట్వీట్ వైరల్ అవుతోంది. ‘ఒక క్రికెటర్‌గా నేను హెడ్‌కు వీరాభిమానిని. రాబోయే రోజుల్లో అతడు అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రేలియాకు భవిష్యత్ స్టార్ అవుతాడు’ అని వార్న్ 2016 డిసెంబర్ 6న ట్వీట్ చేశాడు.
అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన టైటిల్ పోరులో భారత్ ఆది నుంచి తడబడింది. టాస్ ఓడిన భారత్‌ను శుభ్‌మన్ గిల్(4) వికెట్ తీసి మిచెల్ స్టార్క్ దెబ్బకొట్టాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ(47)ను కమిన్స్ వెనక్కి పంపాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్(66), విరాట్ కోహ్లీ(56) ఇన్నింగ్స్ నిర్మించడంతో భారత్ 240 పరుగులు చేసింది.
ట్రావిస్ హెడ్
లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్(137) శతకంతో చెలరేగాడు. డేవిడ్ వార్నర్(7), మిచెల్ మార్ష్(15), స్టీవ్ స్మిత్(4) ఔటైనా.. పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజులో నిలబడ్డ హెడ్ కేవలం 120 బంతుల్లోనే 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 137 పరుగులు చేశాడు. మార్నస్ లబూషేన్(58)తో కలిసి నాలుగో వికెట్‌కు 192 పరుగులు జోడించి ఆసీస్‌ను గెలుపు వాకిట నిలిపాడు. దాంతో, సొంతగడ్డపై రెండోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడాలన్న భారత జట్టకు కల కలగానే మిగిలింది. ఆరో ట్రోఫీతో ఆసీస్ ఏ జట్టుకు అందనంత ఎత్తులో నిలిచింది.