Team India : ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 సన్నాహక మ్యాచ్‌లతో బిజీగా ఉండనుంది. అయితే.. టీమిండియా, బంగ్లాదేశ్(Bangladesh)ల మధ్య జరగాల్సిన సిరీస్‌పై సందిగ్దం నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో బంగ్లాదేశ్ గడ్డపై భారత జట్టు వన్డే, టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకూ భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ఎటువంటి స్పందన లేదు. అయితే.. బంగ్లాదేశ్ బోర్డు మాత్రం సిరీస్‌ను రీషెడ్యూల్ అవుతుందనే నమ్మకంతో ఉంది. ఇరుదేశాల మధ్య సఖ్యత లేనందున రెండు జట్ల మధ్య జరగాల్సిన ఆరు మ్యాచ్‌ల వైట్ బాల్ సిరీస్ రద్దు అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
నిరుడు బంగ్లాలో చెలరేగిన అల్లర్లలో హిందువుల ఊచకోత అనంతరం.. ఇరుదేశాల మధ్య దౌత్యసంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు స్తంభించాయి. బంగ్లాలో తయారైన రెడీమెడ్ దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్‌పై భారత ప్రభుత్వం పరిమితులను ప్రకటించింది. ఈ ప్రభావం ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణపై పడింది.
ముందస్తుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో బంగ్లాదేశ్ పర్యటనకు భారత జట్టు వెళ్లాల్సింది. పొట్టి ప్రపంచకప్ సంసిద్ధత కోసం అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సింది. కానీ, ఇప్పుడు సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాడు. దాంతో.. టీమిండియా ప్రాక్టీ్స్ మ్యాచ్‌లు లేకుండానే వచ్చే ఏడాది జరుగబోయే పొట్టి వరల్డ్ కప్ ఆడాల్సి రావచ్చు. ఇండియా చివరిసారిగా జనవరిలో ఇంగ్లండ్‌తో పొట్టి సీరీస్ ఆడింది.