T20 WORLD CUP | అండర్‌-19 టీ20 ఫైనల్లో యువ భారత్‌.. దక్షిణాఫ్రికాతో టైటిల్‌ పోరు

  • సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఘన విజయం
  • స్పిన్‌తో కట్టడి చేసిన పరుణిక, వైష్ణవి
  • ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన త్రిష

ప్రతిష్ఠాత్మక అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో భారత అమ్మాయిల అజేయ ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాకు న్యాయం చేస్తూ మెగాటోర్నీలో వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం సెమీస్‌లో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించింది. పరుణిక, వైష్ణవి స్పిన్‌ తంత్రంతో ఇంగ్లండ్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. లక్ష్యఛేదనలో తెలంగాణ స్టార్‌ త్రిషతో పాటు కమలిని జోరు కనబర్చడంతో భారత్‌ ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టైటిలో పోరులో దక్షిణాఫ్రికాతో భారత్‌ అమీతుమీ తేల్చుకోనుంది.

T20 World Cup | కౌలాలంపూర్‌ : మహిళల అండర్‌-19 ప్రపంచకప్‌లో ఓటమన్నదే లేకుండా సాగుతున్న భారత అమ్మాయిలు.. వరుసగా ఈ టోర్నీ రెండో ఎడిషన్‌లోనూ ఫైనల్‌ చేరారు. శుక్రవారం కౌలాలంపూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో సెమీస్‌లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు.. పరుణిక సిసోడియా (3/21), వైష్ణవి శర్మ (3/23) స్పిన్‌ మాయకు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులే చేశారు. డెవిన పెరిన్‌ (45), కెప్టెన్‌ నోర్‌గ్రోవ్‌ (30) మినహా మిగిలినవారంతా సింగిల్‌ డిజిట్‌ కూడా దాటలేకపోవడంతో భారత్‌ ఎదుట స్వల్ప లక్ష్యం నిలిచింది. ఛేదనను టీమ్‌ఇండియా 15 ఓవర్లలోనే ఊదేసింది. ఓపెనర్లు కమిలిని (50 బంతుల్లో 56 నాటౌట్‌, 8 ఫోర్లు), తెలంగాణ యువ సంచలనం గొంగడి త్రిష (29 బంతుల్లో 35, 5 ఫోర్లు) ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో లక్ష్యం మరీ చిన్నదైయింది. సెమీస్‌లో గెలిచిన భారత్‌.. ఆదివారం జరుగబోయే ఫైనల్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా.. ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్‌కు చేరింది.

స్పిన్‌ దెబ్బకు ఇంగ్లండ్‌ కుదేలు

ఈ టోర్నీలో అంచనాలకు మించి రాణిస్తూ ప్రత్యర్థి జట్టును కనీసం 75 పరుగులు కూడా దాటకుండా బెంబేలెత్తించిన టీమ్‌ఇండియా.. ఇంగ్లండ్‌తోనూ అదే జోరును కొనసాగించింది. పవర్‌ ప్లేలో కాస్త ప్రతిఘటించినా స్పిన్నర్ల రాకతో ఇంగ్లండ్‌ కుదేలైంది. ఐదో ఓవర్లో జెమీమ (9), జాన్సన్‌ను ఔట్‌ చేసి పరుణిక భారత్‌కు బ్రేక్‌ ఇచ్చింది. నోర్‌గ్రోవ్‌తో కలిసి పెరిన్‌ కాసేపు నిలబడినా 12వ ఓవర్లో అయూశి.. ఆమెను ఔట్‌ చేయడంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది. వైష్ణవి లోయరార్డర్‌ను కట్టడి చేసింది. ఆఖర్లో అమూ(14) ఇంగ్లండ్‌ను వంద పరుగుల మార్కును దాటించి ఈ టోర్నీలో మొదటిసారి భారత్‌పై ఈ ఘనత సాధించిన జట్టుగా నిలిచింది.

త్రిష ధనాధన్‌

స్వల్ప ఛేదనను భారత్‌ దూకుడుగా ఆరంభించింది. ప్రిషా బౌలింగ్‌లో త్రిష లాంగాన్‌ మీదుగా రెండు బౌండరీలు బాదగా కమిలినీ ఓ ఫోర్‌ కొట్టింది. టిల్లీ 6వ ఓవర్లో త్రిష.. మరో రెండు ఫోర్లు సాధించింది. దూకుడుగా ఆడుతున్న త్రిషను 9వ ఓవర్లో బ్రెట్‌.. క్లీన్‌బౌల్డ్‌ చేయడంతో 60 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. త్రిష నిష్క్రమించాక కమిలిని దూకుడు పెంచి గెలుపు లాంఛనాన్ని పూర్తిచేసింది.

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌: 20 ఓవర్లలో 113/8(పెరిన్‌ 45, నోర్‌గ్రోవ్‌ 30, పరుణిక 3/21, వైష్ణవి 3/23),

భారత్‌: 15 ఓవర్లలో 117/1(కమలిని 56 నాటౌట్‌, త్రిష 35, బ్రెట్‌ 1/30)

2025-01-31T23:10:53Z