T20ల్లో మరో బిగ్గెస్ట్ లీగ్.. CL T20 తరహాలో వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్! ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!!

క్రికెట్ చరిత్రలో టీ20 ఫార్మెట్ హిట్టయినట్టు ఏది కూడా సక్సెస్ కాలేదు. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఎన్నో లీగ్స్ వచ్చాయి. బిగ్ బాష్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ సూపర్ సక్సెస్ సాధించాయి. ఐపీఎల్ తర్వాత ఛాంపియన్స్ లీగ్ టీ20 వచ్చింది. 2014 వరకు మాత్రమే కొనసాగిన ఛాంపియన్స్ లీగ్‌ను మళ్లీ తీసుకొచ్చేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని ఈసీబీ చీఫ్ రిచర్డ్ గౌల్డ్ స్పష్టం చేశాడు.

ఛాంపియన్స్ లీగ్ టీ20 తరహాలో పొట్టి ఫార్మాట్‌లో మరో నూతన టోర్నీ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఈసీబీ సీఈఓ రిచర్డ్ ఈఎస్‌పీఎన్‌తో చెప్పాడు. దీనికి వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్ అనే పేరు కూడా అనుకుంటున్నారు. పురుషులతో పాటు మహిళలకు ఈ వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్ లీగ్ నిర్వహిస్తామని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదంటూ రిచర్డ్ గట్టి నమ్మకంతో ఉన్నాడు.

ఛాంపియన్స్ లీగ్ టీ20

బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా, క్రికెట్ సౌతాఫ్రికా బోర్డులన్నీ కలిసి 2009లో ఛాంపియన్స్ లీగ్ టీ20ను ఏర్పాటు చేశాయి. ఐసీసీ మాజీ ఛైర్మన్ ఎన్.శ్రీనివాసన్ నేతృత్వంలో ఈ ఛాంపియన్స్ లీగ్ మొదలైంది. 2008లోనే ప్లాన్ చేసినప్పటికీ ముంబై అటాక్స్ జరగడంతో అర్ధంతరంగా లీగ్‌ను ఆపేశారు. 2009లో తిరిగి ప్రారంభమై.. 2014 వరకు విజయవంతంగా కొనసాగించారు. 2014 తర్వాత ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లు అధికమవడంతో ప్రజాదరణ లేకపోవడంతో సీఎల్‌టీ20 కాస్తా ఆగిపోయింది.

అయితే, ఆగిపోయిన ఛాంపియన్స్ లీగ్ టీ20 తరహాలో వరల్డ్ క్లబ్ ఛాంపియన్ షిప్‌ను ఏర్పాటు చేయాలని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎక్కువ ఆసక్తితో ఉంది. ఈ వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్ విషయమై ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా ఈఎస్‌పీఎన్‌తో గత నెలలో మాట్లాడాడు. ఐపీఎల్‌లోని పది ఫ్రాంఛైజీల్లో ఎనిమిది, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లోని ఐదు ఫ్రాంఛైజీల్లో నాలుగు టీమ్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఆయన చెప్పాడు.

మరి ఈ వరల్డ్ క్లబ్ ఛాంపియన్ షిప్ ఎలా నిర్వహిస్తారు అనేదానిపై పూర్తి స్పష్టత మాత్రం లేదు. ఛాంపియన్స్ లీగ్ టీ20 మాదిరి ఐపీఎల్‌లోని టాప్ 4 టీమ్స్, మిగతా లీగ్స్‌లోని విన్నర్, రన్నర్స్‌ను తీసుకుంటారా? లేక వీటి కోసం సపరేట్ టీమ్స్‌ను కొనుగోలు చేస్తారా? అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. మొత్తానికి ప్రపంచ క్రికెట్‌లోకి మరో కొత్త లీగ్ ఎంట్రీ ఇవ్వనుంది.

2025-06-06T09:13:25Z