పల్లెకెలె: శ్రీలంకతో జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో ఇండియా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది. తొలుత మ్యాచ్ టై కాగా, ఆ తర్వాత సూపర్ ఓవర్ ద్వారా ఇండియా గెలిచింది. కేవలం 138 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన శ్రీలంక.. చివరి ఓవర్‌లో గెలుపు కోసం ఆరు రన్స్ మాత్రం చేయాల్సి ఉంది. అయితే ఆ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) అనూహ్య రీతిలో బౌలింగ్ చేశాడు. స్పిన్‌కు అనుకూలిస్తున్న ఆ పిచ్‌పై సూర్య అద్భుతంగా బౌల్ చేశాడు. అయిదు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. స్కోర్లు సమం కావడంతో.. మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది.
బౌలింగ్‌లో స్టన్నింగ్ షో ఇచ్చిన సూర్యపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆ ఓవర్‌కు చెందిన వీడియోను సోనీ స్పోర్ట్స్ తన ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేసింది. సూర్య వేసిన తొలి బంతికి పరుగులు రాలేదు. ఇక రెండో బంతికి కమిందు మెండిస్ ఔట్ అయ్యాడు. మూడవ బంతికి మహేశ్ తీక్షణ ఔట్ అయ్యాడు. నాలుగవ బంతికి ఒక రన్ వచ్చింది. అయిదో బంతికి రెండు పరుగులు, ఆరో బంతికి కూడా రెండు రన్స్ వచ్చాయి. దీంతో మ్యాచ్ టై అయ్యింది.
ఇక సూపర్ ఓవర్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక కేవలం రెండు రన్స్ మాత్రమే చేసింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ తొలి బంతికి ఫోర్ కొట్టి .. జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ విక్టరీతో సోషల్ మీడియాలో కోచ్ గౌతం గంభీర్‌పై ప్రశంసలు కురిశాయి. బౌలింగ్ ప్రయోగం చేసి సక్సెస్ సాధించడంతో సూర్య, గంభీర్‌కు క్రెడిట్ ఇచ్చారు. ఇదే మ్యాచ్‌లో 19వ ఓవర్‌లో రింకూ సింగ్ బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీసుకున్నాడు.