శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను భారత జట్టు 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టీ20 సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. వాస్తవానికి చివరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయానికి 9 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. అప్పటికి క్రీజులో కుశాల్ పెరీరా ఉండటంతో ఆ జట్టు విజయం ఖాయమని అంతా భావించారు. కానీ అనూహ్యంగా బంతి అందుకున్న రింకూ సింగ్.. సంచలన బౌలింగ్ చేశాడు. 19 ఓవర్లలో రెండు వికెట్లు తీసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి ఆరు పరుగులు అవసరమయ్యాయి.
19వ ఓవర్‌ను రింకూ సింగ్ చేత బౌలింగ్ చేయించి అందర్నీ ఆశ్చర్యపరిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. చివరి ఓవర్‌లోనూ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. తానే బౌలింగ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒక్కసారి కూడా బౌలింగ్ చేయని.. సూర్య చివరి ఓవర్ కోసం బంతిని అందుకున్నాడు. తొలి మూడు బంతులకు ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. రెండు వికెట్లు పడగొట్టాడు. నాలుగో బంతికి సింగిల్ రాగా.. సమీకరణం 2 బంతుల్లో 5 రన్స్‌గా మారింది.
అయితే ఇక్కడే సూర్యకుమార్ యాదవ్ చేసిన ఓ తప్పిదం.. మ్యాచును సూపర్ ఓవర్ వరకూ తీసుకెళ్లింది. ఐదో బంతిని ఎదుర్కొనేందుకు విక్రమసింఘే సిద్ధమయ్యాడు. బంతిని లాంగ్ ఆఫ్ దిశగా తరలించాడు. క్రీజులోని బ్యాటర్లు ఇద్దరూ రెండో పరుగుకు ప్రయత్నించారు. ఫీల్డర్ కూడా బంతిని నేరుగా బౌలింగ్ ఎండ్ వైపు ఉన్న సూర్యకుమార్ యాదవ్ వైపు విసిరాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది.
సూర్యకుమార్ యాదవ్ బంతిని అందుకునే సమయానికి బ్యాటర్.. క్రీజుకు చాలా దూరంలో ఉన్నాడు. బంతితో వికెట్లను గిరాటేస్తే రనౌట్ జరిగేది. కానీ సూర్యకుమార్ మాత్రం.. క్రీజులోకి బ్యాటర్ వచ్చాడా లేడా అనేది చూడకుండా బంతిన అందుకుని నేరుగా వికెట్ కీపర్ ఎండ్ వైపు విసిరాడు. అయితే బౌలర్ ఎండ్ వైపు బ్యాటర్ రాలేదనే విషయాన్ని అప్పుడు గమనించి.. అరరే. . అనుకున్నాడు. సూర్యకుమార్ విసిరిన బంతి కీపర్ సంజూశాంసన్ చేతికి వెళ్లే సరికే.. బ్యాటర్ క్రీజులోకి వచ్చాడు. దీంతో ఆ జట్టుకు రెండు పరుగులు లభించాయి. ఆ తర్వాత బంతికి సైతం రెండు పరుగులు చేసిన శ్రీలంక స్కోర్లను సమం చేసింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు.. కష్టమైన టాస్క్‌లను ఈజీగా చేసే.. సూర్యకుమార్.. ఈజీ రనౌట్‌ను మిస్ చేశాడని కామెంట్లు చేస్తున్నారు.
సూర్యకుమార్.. త్రోను కీపర్ వైపు విసరకుండా.. వికెట్లను గిరాటేస్తే మ్యాచ్ సూపర్ ఓవర్ వరకు వెళ్లేది కాదు. ఒక్కపరుగు తేడాతో భారత్ మ్యాచ్ గెలిచేది. సూపర్ ఓవర్‌లో ఫస్టు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత తొలి బంతికే సూర్యకుమార్ ఫోర్ కొట్టి మ్యాచును ముగించాడు.
ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి. 2024-07-31T07:13:22Z dg43tfdfdgfd