SHUBMAN GILL CENTURY: క్వాలిఫయర్-2లో గిల్ సెంచరీ.. ముంబయి టార్గెట్ 234

ఐపీఎల్ 2023 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ (Shubman Gill ) మూడో సెంచరీ బాదేశాడు. ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians)తో అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం జరుగుతున్న క్వాలిఫయర్ -2 మ్యాచ్‌లో శుభమన్ గిల్ 60 బంతుల్లోనే 7x4, 10x6 సాయంతో 129 పరుగులు చేశాడు. దాంతో మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ టీమ్ 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో గిల్‌తో కలిసి గుజరాత్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసిన సాహా (18:16 బంతుల్లో 3x4) తక్కువ స్కోరుకే ఔటైపోయాడు. కానీ.. నెం.3లో బ్యాటింగ్‌కి వచ్చిన సాయి సుదర్శన్ (43 రిటైర్డ్ హర్ట్: 31 బంతుల్లో 5x4, 1x6)తో కలిసి దూకుడుగా ఆడిన శుభమన్ గిల్.. ముంబయి ఇండియన్స్ బౌలర్లని ఉతికారేశాడు. క్రిస్ జోర్దాన్, పీయూస్ చావ్లా, ఆకాశ్ మాద్వాల్‌కి వరుస సిక్సర్లు బాదిన శుభమన్ గిల్.. కామెరూన్ గ్రీన్‌ని కూడా వదల్లేదు. తొలి 32 బంతుల్లో 50 పరుగులు చేసిన గిల్.. ఆ తర్వాత 17 బంతుల్లోనే 100 పరుగుల మార్క్‌ని అందుకోవడం విశేషం. ఈ క్రమంలో మొత్తం 851 పరుగులతో సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచిన గిల్.. ఆరెంజ్ క్యాంప్‌ని కూడా సొంతం చేసుకున్నాడు.

గుజరాత్ టీమ్ స్కోరు 192 వద్ద శుభమన్ గిల్ ఔటైపోగా.. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్య (28 నాటౌట్: 13 బంతుల్లో 2x4, 2x6) వేగంగా ఆడాడు. కానీ సాయి సుదర్శన్ గేర్ మార్చలేకపోవడంతో చివరి ఓవర్‌లో అతని స్థానంలో రషీద్ ఖాన్ (5 నాటౌట్: 2 బంతుల్లో 1x4)ని గుజరాత్ క్రీజులోకి పంపింది. కానీ అతనికి ఎక్కువ బంతులు ఆడే అవకాశం దక్కలేదు. ముంబయి ఇండియన్స్ బౌలర్లలో పీయూస్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్ చెరో వికెట్ పడగొట్టారు.

2023-05-26T16:46:17Z dg43tfdfdgfd