Savita Punia : భారత మహిళల జట్టు కెప్టెన్ సవితా పూనియా(Savita Punia) అరుదైన ఘనతకు చేరువైంది. ఎఫ్ఐహెచ్(FIH) ఏటా అందించే ‘గోల్‌కీపర్ ఆఫ్ ది ఇయర్'(Goal Keeper Of The Year) అవార్డుకు వరుసగా మూడోసారి నామినేట్ అయింది. ఇప్పటికే రెండు పర్యాయాలు ఈ అవార్డు అందుకున్న సవితా ఈసారి విజేతగా నిలిస్తే హ్యాట్రిక్ సాధిస్తుంది.
‘వరుసగా రెండు సంవత్సరాలు నేను ఈ అవార్డు గెలుస్తానని, మళ్లీ మూడోసారి కూడా నామినేట్ అవుతానని అనుకోలేదు. నాకు చాలా గర్వంగా ఉంది. నాతో పాటు జట్టు సభ్యులకు ఇది చాలా గర్వకారణం’ అని సవితా తెలిపింది. వరుసగా 2021, 2022లో సవితా గోల్ కీపర్ ఆఫ్‌ది ఇయర్ అవార్డు అందుకుంది.
సవితా నేతృత్వంలోని భారత జట్టు ఈ ఏడాది అద్భుతంగా రాణించింది. నిరుడు స్పెయిన్‌లో జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ మహిళల నేషన్స్ కప్ విజేతగా అవతరించింది. దాంతో, భారత జట్టుకు ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2023-04 ప్రమోషన్ దక్కింది. అంతేకాదు చైనా వేదికగా జరిగిన 19వ ఆసియా గేమ్స్‌లో భారత్ కాంస్య పతకంతో మెరిసింది.
వచ్చే ఏడాది ప్యారిస్ వేదికగా జరిగే ఒలింపిక్స్ బెర్తుపై కన్నేసిన భారత హాకీ జట్టు.. సొంతగడ్డపై జనవరిలో ఎఫ్ఐహెచ్ హాక ఒలింపిక్ క్వాలిఫయర్ టోర్నీ ఆడనుంది. గ్రూప్ బిలో ఇండియాతో పాటు న్యూజిలాండ్, అమెరికా, ఇటలీ ఉండగా.. గ్రూప్ ఏలో జర్మనీ, జపాన్, చిలీ, చెక్ రిపబ్లిక్ ఉన్నాయి. ఒకవేళ భారత్ ఈ టోర్నీలో టాప్ -3లో నిలిస్తే ఒలింపిక్స్ బెర్తు ఖరారైనట్టే.