RCB | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్‌సీబీ

RCB | ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB) జట్టు విజయోత్సవం సందర్భంగా బుధవారం చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట (Bengaluru stampede) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ ఘటన యావత్‌ జాతిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక ఈ ఘటనపై ఇప్పటికే ఆర్‌సీబీ, క‌ర్ణాక‌ట క్రికెట్ అసోసియేషన్ (Karnataka State Cricket Association), ఈవెంట్ మేనేజ‌ర్లపై కేసు న‌మోదైనన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆర్‌సీబీ యాజమాన్యం కర్ణాటక హైకోర్టును (Karnataka High Court) ఆశ్రయించింది. తమపై నమోదైన క్రిమినల్‌ కేసును కొట్టివేయాలంటూ (quash criminal case) ప్రత్యేక పిటిషన్‌ వేసింది. తమను తప్పుడు కేసులో ఇరికించారని ఆర్సీబీ, రాయల్‌ ఛాలెంజర్స్‌ స్పోర్ట్స్‌ లిమిటెడ్ (ఆర్‌సీఎస్‌ఎల్‌) తరఫు న్యాయవాది వాదించారు. మరోవైపు ఈవెంట్‌ ఆర్గనైజర్‌ అయిన డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను సవాలు చేస్తూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది.

మరోవైపు తమపై దాఖలైన కేసును సవాల్‌ చేస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) ఇటీవలే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కేఎస్‌సీఏ అధ్యక్షుడు రఘురామ్‌ భట్‌, కార్యదర్శి ఎ.శంకర్‌, కోశాధికారి ఈఎస్ జయరాం సంయుక్తంగా కర్ణాటక హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. తమపై నమోదైన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. వారిపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులు, ప్రభుత్వానికి సూచించింది. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 13వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు సహకరించాలని, న్యాయస్థానం పరిధి దాటి ఎక్కడకు వెళ్లాలన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలని అర్జీదారులకు న్యాయస్థానం సూచించింది.

Also Read..

“Bengaluru Stampede | బెంగళూరు తొక్కిసలాట ఘటన.. గాయపడిన వారికి నోటీసులు జారీ”

“తొక్కిసలాటతో నాకు సంబంధం లేదు..కర్ణాటక సీఎం సిద్ధరామయ్య”

“కేఎస్‌సీఏ కార్యదర్శి, కోశాధికారి రాజీనామా”

2025-06-09T09:29:13Z