ఆర్సీబీ విక్టరీ పరేడ్ విషాదంగా మారడంతో కర్ణాటక ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన ప్రభుత్వం, ఈ ఘటనకు బాధ్యులైన వారిని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. ఆర్సీబీ ఫ్రాంఛైజీని కూడా నిందితుల లిస్ట్‌లో చేసిన పోలీసులు.. ఆ జట్టు మార్కెటింగ్ హెడ్‌ను కటకటాల వెనక్కి తోశారు. అసలు ఇంత జరగడానికి కారణమైన చిన్నస్వామి స్టేడియంలో ఇకపై మ్యాచ్‌లు జరగకుండా.. స్టేడియాన్ని మరోచోటుకి మార్చాలని ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ పరేడ్‌తో పాటు చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్స్ నిర్వహించింది. పరేడ్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కూడా హాజరు కావడంతో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో సీరియస్ అయిన సీఎం బాధ్యులను అరెస్టు చేయాలంటూ కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు.
స్టేడియం మార్పుపై సీఎం సిద్ధారామయ్య
చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకున్న ఘటనకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం చూపేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధారామయ్య వెల్లడించారు. ప్రభుత్వం బెంగళూరు స్టేడియాన్ని మరో చోటుకు తరలించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 'ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పరిస్థితి రావాలని కోరుకోదు. ఈ ఘటన నన్నెంత బాధించింది. అందుకే ఐదుగురు పోలీస్ అధికారులతో పాటు.. ఇంటెలిజెన్స్ చీఫ్, ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారుడిని కూడా మార్చేశాము' అని సిద్ధారామయ్య అన్నారు.
జూన్ 4న జరిగిన దురదృష్ట ఘటనలో ప్రభుత్వం ఎలాంటి తప్పిదాలు చేయాలేదని సీఎం స్పష్టతనిచ్చారు. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ బీజేపీ, జేడీఎస్ నేతల డిమాండ్‌పై ఆయన స్పందిస్తూ.. కుంభమేళా సమయంలో ప్రజలు చనిపోయారు, అప్పుడు ఉత్తరప్రదేశ్ సీఎం రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు.
ఆర్సీబీ విక్టరీ సెలబ్రేషన్స్ కర్ణాటక ప్రభుత్వం నిర్వహించింది కాదని, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు. ఆ కార్యక్రమానికి తమను అతిథులుగా ఆహ్వానించడంతో వెళ్లామని ఆయన స్పష్టం చేశారు. గవర్నర్ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారని చెప్పడంతోనే తాను వెళ్లినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. తాను కేవలం ఆ కార్యక్రమానికి మాత్రమే హాజరయ్యానని, మిగతాదంతా తనకేం తెలియదని ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు.
2025-06-09T04:54:40Z