RCB పరేడ్ ఎఫెక్ట్.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌లో వరుస రాజీనామాలు!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవ ర్యాలీ విషాదంగా మారిన విషయం తెలిసిందే. లక్షల సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియం చుట్టూ చేరడంతో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా అభిమానులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఘటనకు బాధ్యత వహిస్తూ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కీలక సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.

క్రికెట్ లోకం నివ్వెరపోయిన ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం కూడా తీవ్రంగానే స్పందించింది. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలకు కూడా ఆదేశించింది.. అందులో భాగంగానే అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. తాజాగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ ఏ.శంకర్, ట్రెజరర్ ఈఎస్ జైరామ్ తమ పదవులకు చేశారు. గురువారం రాత్రే తమ రాజీనామా పత్రాలను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌ అధ్యక్షుడు రఘురామ్ భట్‌కు అందజేసినట్లు వారు పేర్కొన్నారు.

ఆర్సీబీ జూన్ 3న ట్రోఫీ అందుకోగా... జూన్ 4న కర్ణాటక రాష్ట్ర విధాన సభ దగ్గర నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీలో దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది అభిమానులు పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ప్లేయర్ల సన్మానంతో పాటు సెలబ్రేషన్స్ కూడా కొనసాగాయి.

చిన్నస్వామి స్టేడియంలో కేవలం 32 వేల మంది మాత్రమే కూర్చునే అవకాశం ఉంటుంది. సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలో చిన్నస్వామి స్టేడియం బయట లక్షలాది మంది అభిమానులు నిలిచిపోయారు. దాంతో అభిమానులు ఒక్కసారిగా స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. గేట్ వద్ద తొక్కిసలాట జరగడంతో ముందున్న అభిమానులు ఒక్కసారిగా కిందపడిపోయారు. ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 56 మంది గాయపడ్డారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య సీరియస్ అయ్యారు. ఘటనకు కారణమైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయడమే కాకుండా.. నిర్వాహకులను అరెస్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేతో పాటు సెలబ్రేషన్స్ నిర్వహించిన డీఎన్‌ఏ ఎంటర్‌‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్గనైజర్స్ సునీల్ మాథ్యూ, కిరణ్, సుమంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

2025-06-07T06:16:49Z