ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా జరిగిన ఘటనపై బీసీసీఐ సీరియస్ అయింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తాజాగా స్పందిస్తూ.. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు.
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించి, తొలిసారి ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఈ సందర్భంగా కర్ణాటక విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు భారీ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్‌లో లక్షలాది మంది అభిమానులు పాల్గొన్నారు. అనంతరం చిన్నస్వామి స్టేడియంలో విక్టరీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అదే సమయంలో స్టేడియం గేటు వద్ద జరిగిన తోపులాటలో 11 మంది మృతిచెందగా, 50 మందికి పైగా గాయపడ్డారు.
"బీసీసీఐ అధీనంలో ఉండుంటే.. మొత్తం బీసీసీఐనే చూసుకునేది. టీ20 వరల్డ్‌కప్ 2024 గెలిచిన తర్వాత ముంబైలో విక్టరీ పరేడ్ నిర్వహించాం. మేం ఆ పరేడ్ కోసం చాలా సమయం తీసుకున్నాం. అయితే, బెంగళూరులో మాత్రం అది కేవలం గంటల వ్యవధిలోనే ముగిసింది, నేనయితే దుర్ఘటనకు అదే కారణమని అనుకుంటున్నాను" అని దేవజిత్ సైకియా అన్నారు.
ఆర్సీబీకి సంబంధించిన ప్రైవేట్ వ్యవహారం అయినప్పటికీ.. దీన్ని మేం మౌనంగా చూస్తూ ఉండలేమని బీసీసీఐ సెక్రటరీ అన్నారు. ఎందుకంటే ఈ దేశంలో క్రికెట్ వ్యవహారాలకు తాము బాధ్యత తీసుకోవాల్సిందేనని.. ఏదో ఒకటి చేయాలని ఆయన అన్నారు. ఇదే విషయమై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా స్పందించారు. రోడ్ షోలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకపోవడమే మంచిది అని గంభీర్ అన్నారు.
ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడమే కాకుండా అరెస్టుల పరంపర కూడా కొనసాగించాడు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలెతో డీఎన్ఏ ఈవెంట్ ఆర్గనైజింగ్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులు సునీల్ మాథ్యూ, కిరణ్, సుమంత్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏ.శంకర్, కోశాధికారి జైరాం తమ పదవులకు రాజీనామా చేశారు. విక్టరీ పరేడ్ బందోబస్తుకు బాధ్యత వహించిన పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేశారు.
2025-06-07T12:02:51Z