RANJI TROPHY: 9వ స్థానంలో వచ్చి సెంచరీ.. రికార్డ్ క్రియేట్ చేసిన సౌరాష్ట్ర క్రికెటర్

పంజాబ్‌తో జరుగుతోన్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సౌరాష్ట్ర ఆటగాడు పార్థ్ భుట్ సెంచరీతో అదరగొట్టాడు. రంజీల్లో 9 లేదా అంతకంటే దిగువ స్థానంలో బ్యాటింగ్‌కొచ్చి సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోన్న క్వార్టర్ ఫైనల్లో పంజాబ్‌పై టాస్ గెలిచిన సౌరాష్ట్ర ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

రవీంద్ర జడేజాతోపాటు జయదేవ్ ఉనద్కత్, ఛతేశ్వర్ పుజారా లాంటి ఆటగాళ్లు లేకుండానే సౌరాష్ట్ర ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. గత మ్యాచ్‌లో తమిళనాడుపై సెంచరీ చేసిన ఓపెనర్ హార్విక్ దేశాయ్.. తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా గుర్తింపు పొందిన బాల్‌తేజ్ సింగ్ అతణ్ని ఔట్ చేశాడు. దీంతో సౌరాష్ట్ర ఒక్క పరుగుకే ఓపెనర్ వికెట్ కోల్పోయింది. స్నెల్ పటేల్ (70), విశ్వరాజ్ సింగ్ జడేజా (28) రెండో వికెట్‌కు 76 పరుగులు జోడించారు. కుదురుకుంటున్న దశలో షెల్డన్ జాక్సన్ (18) ఔట్ కాగా.. కెప్టెన్ అర్పిత్, చిరాగ్ జానీ త్వరగా ఔటయ్యారు. స్పిన్నర్ మయాంక్ మార్కండే, సిద్ధార్థ్ కౌల్ దెబ్బకు మిగతా బ్యాటర్లు కూడా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో సౌరాష్ట్ర 147 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.

పంజాబ్ బౌలర్ల దూకుడు చూస్తే సౌరాష్ట్ర మరికాసేపట్లో ఆలౌట్ కావడం ఖాయమనిపించింది. కానీ 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పార్థ్ భుట్ (155 బంతుల్లో 111 నాటౌట్) అద్భుతంగా పోరాడాడు. చేతన్ సకారియా (22)తో కలిసి 9వ వికెట్‌కు 61 పరుగులు జోడించిన పార్థ్.. చివరి వికెట్‌కు యువరాజ్ సిన్హ్ దోదియా (50 బంతుల్లో 17)తో కలిసి 95 రన్స్ జోడించాడు. దీంతో సౌరాష్ట్ర 87 ఓవర్లలో 303 పరుగులు చేయగలిగింది.

93 పరుగుల వద్ద పార్థ్ ఇచ్చిన తేలికైన క్యా్చ్‌ను మయాంక్ మార్కండేయ జారవిడవటంతో బతికిపోయిన సౌరాష్ట్ర బ్యాటర్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి పంజాబ్ ఒక ఓవర్లో 3 పరుగులు చేసింది. ప్రభుసిమ్రాన్ సింగ్ (2), నమన్ ధిర్ (1) క్రీజ్‌లో ఉన్నారు.

ఎవరీ పార్థ్ భుట్..?

గుజరాత్‌లోని జునాగఢ్‌లో 1997 ఆగస్టు 4న పార్థ్ భుట్ జన్మించాడు. 2019 డిసెంబర్ 25న రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 2021 మార్చిలో లిస్ట్-ఏ క్రికెట్లోకి అడుగుపెట్టిన పార్థ్.. అదే ఏడాది నవంబర్‌లో సౌరాష్ట్ర తరఫున టీ20ల్లోకి (సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ) అడుగుపెట్టాడు.

2023-01-31T12:12:06Z dg43tfdfdgfd