RAHUL GANDHI | జీవితంలో క్రికెట్‌ బ్యాట్‌ పట్టనోడు ఐసీసీ ఇన్‌చార్జి.. జై షాపై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi | కాంగ్రెస్‌ అగ్రనాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్‌ గాంధీ.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కుమారుడు జై షా పై సంచలన ఆరోపణలు చేశారు. జై షా జీవితంలో ఒక్కసారి కూడా క్రికెట్‌ బ్యాట్‌ పట్టుకోకపోయినా ఆయన క్రికెట్‌లో అత్యున్నత పదవిని అనుభవిస్తున్నాడంటూ విమర్శలు గుప్పించారు. జమ్మూ, కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంత్‌నాగ్‌లో నిర్వహించిన ప్రచారసభలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు కాంగ్రెస్‌ అధికారిక ఎక్స్ ఖాతాలో విడుదల చేసిన వీడియోలో రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. ‘ఈ దేశాన్ని ముగ్గురు నలుగురు వ్యాపారవేత్తలు నడుపుతున్నారు. అమిత్‌ షా కొడుకు జీవితంలో ఒక్కసారి కూడా క్రికెట్ బ్యాట్‌ పట్టలేదు. కానీ అతడు మాత్రం క్రికెట్‌కు ఇన్‌చార్జిగా ఉన్నాడు’ అంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యాక ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ సైతం వ్యంగ్యంగా ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.

 

కాగా కొద్దిరోజుల క్రితమే జై షా ఐసీసీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. 17 మంది సభ్యులున్న ఐసీసీ ప్యానెల్‌లో ఒక్క పాకిస్థాన్‌ మినహా మిగిలినవారంతా జై షా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌ 1న అతడు ఐసీసీ చైర్మన్‌ బాధ్యతలను చేపట్టబోతున్నాడు. భారత్‌ నుంచి ఈ బాధ్యతలను నిర్వర్తించబోయే ఐదో వ్యక్తి జై షా కాగా అందరిలోనూ అత్యంత పిన్న వయస్కుడు అతడే కావడం గమనార్హం. గతంలో భారత్‌ నుంచి జగ్‌మోహన్‌ దాల్మియా, శరద్‌ పవార్‌, శ్రీనివాసన్‌, శశాంక్‌ మనోహర్‌ ఈ పదవిలో పనిచేశారు. జై షా త్వరలోనే బీసీసీఐ కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశముంది.

 

2024-09-04T12:49:40Z dg43tfdfdgfd