PKL 11 Season : మట్టిలో పుట్టిన గ్రామీణ ఆట కబడ్డీకి ఎనలేని గుర్తింపు తెచ్చిన ప్రో కబడ్డీ లీగ్(PKL) మరో సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. ఈమధ్యే వేలం ముగియడంతో నిర్వాహకులు షెడ్యూల్ విడుదల చేశారు. పీకేఎల్ 11 వ సీజన్ అక్టోబర్ 12వ తేదీన మొదలవ్వనుంది. సరిగ్గా విజయదశమి రోజే హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో కబడ్డీ పండుగ ఆరంభం కానుంది. గత పది సీజన్లుగా అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ టోర్నీని ఈసారి మూడు నగరాల్లో నిర్వహించనున్నారు.
‘పీకేఎల్ 11వ సీజన్ తేదీలను, వేదికలను ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 11వ సీజన్ సరికొత్త చరిత్ర సృష్టించనుంది. పీకేఎల్‌తో దేశవ్యాప్తంగా కబడ్డీ ఆటకు మరింత ప్రాచుర్యం రానుంది’ అని లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి (Anupam Goswami) ఓ ప్రకటనలో వెల్లడించాడు.
పీకేఎల్ 11వ సీజన్‌ను అభిమానులకు మరింత చేరువ కానుంది. తొలుత హైదరాబాద్ వేదకగా పోటీలు జరుగనున్నాయి. అనంతరం నోయిడాలో కబడ్డీ స్టార్ల సందడి చేయనున్నారు. నవంబర్ 10 నుంచి అక్కడి ఇండోర్ స్టేడియం వేదికగా స్టార్ రైడర్లు, డిఫెండర్లు గర్జించనున్నారు. అనంతరం పూణెలో పీకేఎల్ హంగామా మొదలవ్వనుంది. అక్కడి బలెవడి బ్యాడ్మింటన్ స్టేడియంలో కబడ్డీ.. కబడ్డీ కూత వినపడనుంది. డిసెంబర్ 3 నుంచి ఇక్కడ మ్యాచ్‌లు జరుగుతాయి.
ముంబైలో ఆగస్టు 15, 16 తేదీల్లో పీకేఎల్ వేలం జరిగింది. ఈసారి ఏకంగా ఎనిమిది మంది రూ. 1 కోటిపైనే కొల్లగొట్టారు. రైడర్లు, డిఫెండర్ల కోసం ఫ్రాంచైజీలు భారీ ధర పెట్టడం ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో ఇదే ప్రథమం. ఈసారి కూడా 12 జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. పదో సీజన్ విజేత పుణెరి పల్టన్ డిఫెండింగ్ చాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టనుంది.