Paris Olympics 2024 : హాకీలో ఒకప్పుడు స్వర్ణాలతో అదరగొట్టిన భారత జట్టు (Team India) పారిస్‌లో పంజా విసురుతోంది. టోక్యోలో కాంస్యం కొల్లగొట్టిన హర్మన్‌ప్రీత్ సింగ్ (Harmanpreet Singh) సారథ్యంలోని పురుషుల జట్టు ఈసారి కూడా విశ్వ క్రీడల్లో అజేయంగా దూసుకెళ్తోంది. ఈ మెగా టోర్నీలో ఓటమెరుగని భారత్.. మంగళవారం ఐర్లాండ్ (Ireland)ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ రెండు గోల్స్‌తో మెరవగా 2-0తో ప్రత్యర్థిని మట్టికరిపించింది.
ఒలింపిక్స్ అజేయంగా దూసుకెళ్తున్న భారత హాకీ జట్టు మూడో మ్యాచ్‌లోనూ జోరు చూపించింది. అర్జెంటీనా (Argentina)తో గెలవాల్సిన మ్యాచ్ డ్రా చేసుకున్న టీమిండియా మంగళవారం ఐర్లాండ్‌పై టాప్ గేర్‌లో ఆడింది. ఆట మొదలైన 11వ నిమిషంలోనే హర్మన్‌ప్రీత్ జట్టుకు తొలి గోల్ అందించాడు. దాంతో, భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఆ తర్వాత 19వ నిమిషంలో భారత కెప్టెన్ మరోసారి బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. దాంతో, భారత జట్టు 2-0తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఐర్లాండ్ ఆటగాళ్లు రెండో అర్ధ భాగంలోనూ ఎంత ప్రయత్నించినా వాళ్ల ఎత్తులను డిఫెండర్లు, గోల్ కీపర్ శ్రీజేష్‌లు చిత్తు చేశారు. దాంతో, టీమిండియా అద్భుత విజయం నమోదు చేసి క్వార్టర్ ఫైనల్‌కు మరింత చేరువైంది. ఈ టోర్నీలో భారత సారథి ఇప్పటికే నాలుగు గోల్స్ కొట్టడం విశేషం.