PARALYMPICS | ప్రీతి డబుల్‌ ధమాకా.. పారాలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం

  • 200 మీటర్ల రేసులోనూ కాంస్యం
  • బ్యాడ్మింటన్‌లో భారత్‌కు మూడు పతకాలు పక్కా

పారాలింపిక్స్‌లో రెండ్రోజుల క్రితమే కాంస్యంతో మెరిసిన పారా అథ్లెట్‌ ప్రీతి పాల్‌ ఆదివారం మరో పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 200 మీటర్ల రేసులోనూ ఆమె కంచు మోత మోగించి క్రీడాభిమానుల ఆనందాన్ని రెండింతలు చేసింది. రెండ్రోజుల వ్యవధిలోనే రెండు పతకాలు కొల్లగొట్టిన ఆమె పారాలింపిక్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి పారా అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. మరోవైపు బ్యాడ్మింటన్‌లో మన షట్లర్లు దేశానికి మూడు పతకాలు ఖాయం చేశారు.

Paralympics | పారిస్‌: రెండ్రోజుల క్రితమే మహిళల వంద మీటర్ల పరుగు పందెం (టీ35 కేటగిరీ)లో కాంస్యం గెలిచిన పారా అథ్లెట్‌ ప్రీతి పాల్‌ మరోసారి సంచలన ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన మహిళల 200 మీటర్ల (టీ35) రేసును 30.01 సెకన్లలోనే పూర్తిచేసి వరుసగా రెండో కాంస్యాన్ని సొంతం చేసుకుంది. చైనా అమ్మాయిలు జియా ఝూ (28.15), క్వియాన్‌కిన్‌ (29.09) వరుసగా స్వర్ణ, రజతాలు కైవసం చేసుకున్నారు. ప్రీతి తృటిలో అగ్రస్థానంలో నిలిచే అవకాశాన్ని కోల్పోయింది. ఈ పతకం నెగ్గడం ద్వారా భారత్‌ నుంచి పారాలింపిక్స్‌ ఒకే ఎడిషన్‌లో రెండు మెడల్స్‌ గెలిచిన మూడో పారా క్రీడాకారిణిగా ప్రీతి రికార్డులకెక్కింది. అంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లో షూటర్‌ అవని లేఖరా, మరో షూటర్‌ సింగ్‌రాజ్‌ అధన ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించినవారిలో ఉన్నారు. అయితే ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌లో మాత్రం ఈ ఘనత సాధించిన తొలి అథ్లెట్‌ ప్రీతి మాత్రమే.

బ్యాడ్మింటన్‌లో మూడు పతకాలు పక్కా: పురుషుల సింగిల్స్‌ (ఎస్‌ఎల్‌3) సెమీస్‌లో కుమార్‌ నితేశ్‌.. 21-16, 21-16తో ఫుజిహర (జపాన్‌)ను ఓడించి ఫైనల్స్‌కు చేరాడు. మరో ఈవెంట్‌ పురుషుల సింగిల్స్‌ (ఎస్‌ఎల్‌4) సెమీస్‌లో సుహాస్‌ యతిరాజ్‌ 21-17, 21-12తో భారత్‌కే చెందిన సుకాంత్‌ కదమ్‌ను ఓడించి గోల్డ్‌ మెడల్‌ మ్యాచ్‌కు అర్హత సాధించాడు. ఈ ఇద్దరూ ఫైనల్స్‌లో గెలిస్తే దేశానికి రెండు స్వర్ణాలు అందించే అవకాశం ఉండగా ఓడినా కనీసం రజతాలు అయితే భారత్‌ ఖాతాలో చేరనున్నాయి.

మహిళల విభాగాల్లోనూ భారత్‌కు పతకం దక్కే విజయాలే నమోదయ్యాయి. మహిళల సింగిల్స్‌ (ఎస్‌యూ5) క్వార్టర్స్‌ పోరులో మనీష రామదాస్‌ 21-13, 21-16తో మమికొ టొయొడ (జపాన్‌)ను ఓడించి సెమీస్‌ పోరుకు అర్హత సాధించింది. సెమీస్‌లో ఆమె భారత్‌కే చెందిన తులసిమతి మురుగేశన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ పోరులో గెలిచిన విజేత ఫైనల్స్‌కు చేరనుండగా ఓడినవాళ్లు కాంస్య పోరులో ఆడతారు. మహిళల సింగిల్స్‌ (ఎస్‌హెచ్‌6) క్వార్టర్స్‌లో నిత్య శ్రీ సివన్‌ 21-4, 21-7తో ఒలివియా (పోలండ్‌)ను ఓడించి సెమీస్‌కు చేరింది.

కాంస్య పోరులో ఓడిన రాకేశ్‌

ఆర్చరీ పురుషుల వ్యక్తిగత కాంపౌండ్‌లో ఒక్కో మెట్టు ఎక్కుతూ కాంస్య పోరుకు అర్హత సాధించిన రాకేశ్‌ తృటిలో పతకాన్ని కోల్పోయాడు. కాంస్య పోరులో అతడు 146-147తో హి జిహావో చేతిలో ఓటమిపాలయ్యాడు. ఒక్క పాయింట్‌ తేడాతో రాకేశ్‌ కాంస్యం చేజార్చుకోవడం గమనార్హం. అంతకుముందు సెమీస్‌లో రాకేశ్‌ 143-145తో జిన్లియాంగ్‌ (చైనా) చేతిలో ఓడి కాంస్య పోరుకు అర్హత సాధించాడు.

షూటింగ్‌లో నిరాశ

రెండు రోజుల్లోనే దేశానికి నాలుగు పతకాలు అందించిన షూటర్లు ఆదివారం మాత్రం నిరాశపరిచారు. పారిస్‌లో ఇదివరకే పది మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌లో స్వర్ణం నెగ్గిన అవని లేఖరా ఆదివారం జరిగిన పది మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ (ఎస్‌హెచ్‌1) మిక్స్‌డ్‌ ఈవెంట్‌ క్వాలిఫికేషన్‌లో 11వ స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్‌ మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ (ఎస్‌హెచ్‌2)లో శ్రీహర్ష రామకృష్ణ 26వ స్థానంలో నిలిచాడు. క్వాలిఫికేషన్‌ రౌండ్స్‌లో టాప్‌8 లో నిలిచినవారే ఫైనల్స్‌కు అర్హత సాధిస్తారు.

2024-09-02T00:18:43Z dg43tfdfdgfd