పారాలింపిక్స్‌లో భారత పారా క్రీడాకారులు పతకాల పంట పండిస్తున్నారు. పలు క్రీడాంశాల్లో మన అథ్లెట్లు సత్తాచాటడంతో సోమవారం ఒక్కరోజే దేశానికి 8 పతకాలు దక్కాయి. బ్యాడ్మింటన్‌లో షట్లర్లు ఏకంగా 4 పతకాలతో చెలరేగారు. ఈ క్రీడలోని పలు విభాగాల్లో పోటీపడ్డ మన షట్లర్లు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో మెరవడంతో పతకాల పట్టికలో భారత్ రెండంకెల మార్కును దాటేసింది. వీరికి తోడు అథ్లెటిక్స్‌లో ఒక పసిడితో పాటు ఇద్దరు అథ్లెట్లు వెండి వెలుగులు పంచారు. ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్ ఫైనల్‌కు తృటిలో అర్హత సాధించే అవకాశం కోల్పోయినా శీతల్‌దేవి, రాకేశ్ జోడీ కాంస్య పోరులో భారత్ పతకం ఖాయం చేసుకుంది.
Paralympics | పారిస్: అదే ఉత్సాహం.. అదే కసి..! పారాలింపిక్స్‌లో 25 పతకాలే లక్ష్యంగా సాగుతున్న భారత పారా క్రీడాకారులు ఆ దిశగా విజయవంతంగా సాగుతున్నారు. సోమవారం బ్యాడ్మింటన్‌లో 4, అథ్లెటిక్స్‌లో 3, ఆర్చరీలో ఒక పతకంతో ఒక్కరోజే 8 మెడల్స్‌తో రెండంకెల మార్కును దాటిన భారత్.. పతకాల పట్టికలో ఏకంగా 14 స్థానాలు ఎగబాకి 15వ స్థానంలో నిలిచింది. బ్యాడ్మింటన్‌లో నితేశ్ కుమార్ (ఎస్‌ఎల్3) స్వర్ణంతో మెరవగా సుహాస్ యతిరాజ్ (ఎస్‌ఎల్4), తులసిమథి మురుగేశన్ (ఎస్‌యూ5) రజతాలు పట్టుకొచ్చారు. మనీష రామదాస్ (ఎస్‌యూ5) కాంస్యం గెలిచింది. అథ్లెటిక్స్ విషయానికొస్తే డిఫెండింగ్ చాంపియన్ అయిన జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ (ఎఫ్64) మరోసారి ఈటను ప్రత్యర్థులకు అందనంత దూరం విసిరి పసిడిని నిలబెట్టుకోగా డిస్కస్ త్రోలో కతునియా యోగేశ్ (ఎఫ్56), హైజంప్‌లో నిషాద్ కుమార్ (టీ47) సిల్వర్ మెడల్స్ దక్కించుకున్నారు. ఆర్చరీలో యువ సంచలనం శీతల్ దేవి, వరల్డ్ నంబర్‌వన్ ఆర్చర్ రాకేశ్ కుమార్ ద్వయం కాంస్యం నెగ్గింది.
బ్యాడ్మింటన్‌లో అబ్బాయిలతో పాటు అమ్మాయిలూ సత్తా చాటారు. మహిళల సింగిల్స్ ఎస్‌యూ5 ఫైనల్‌లో తులసిమథి 17-21, 10-21తో యాంగ్ క్విక్సియా (చైనా) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. మొదటి గేమ్‌లో కాస్త ప్రతిఘటించినా చైనా ప్రత్యర్థి దూకుడుగా ఆడటంతో తులసి వెనుకబడిపోయింది. ఇదే ఈవెంట్ కాంస్య పోరులో మనీష రామదాస్ 21-12, 21-8తో క్యాథరీన్ (డెన్మార్క్)ను చిత్తు చేసి కంచు మోత మోగించింది. సెమీస్‌లో తులసిమథి చేతిలో ఓడిన మనీష.. కీలక పోరులో మాత్రం దూకుడుగా ఆడి పతకాన్ని దక్కించుకుంది.
వరుసగా రెండో స్వర్ణంపై కన్నేసిన పారా అథ్లెట్ సుమిత్ అంటిల్ ఆ అంచనాలకు మించి రాణించాడు. తొలి త్రో నుంచే ఈటను ప్రత్యర్థులకు అందనంత దూరం విసిరిన అతడు.. 70.59 మీటర్ల రికార్డు త్రో తో మరోసారి పసిడి ప్రదర్శన చేశాడు. పారాలింపిక్స్ చరిత్ర (ఎఫ్54)లో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. తొలి త్రో నే 69.11 మీటర్ల దూరం విసిరిన అతడు రెండో త్రో తో 70 మీటర్ల మార్కును దాటాడు. ఫైనల్ బరిలో నిలిచిన మిగిలిన 9 మందిలో ఒక్కరు కూడా 68 మీటర్ల మార్కును దాటలేకపోయారు. 67.03 మీటర్లు విసిరిన శ్రీలంక అథ్లెట్ దులన్ కొడిథువక్కు (ఎఫ్44) రజతం సాధించాడు. బురియన్ ముచల్ (64.89 మీటర్లు, ఆస్ట్రేలియా) కాంస్యం గెలుచుకోగా భారత్‌కే చెందిన సందీప్ నాలుగో స్థానంలో నిలిచాడు.
పురుషుల హైజంప్ టీ47 ఈవెంట్‌లో నిషాద్ కుమార్ రజతం సాధించాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్‌లో నిషాద్.. 2.04 మీటర్ల ఎత్తు దూకి రెండో స్థానంలో నిలవడంతో వెండి అతడి సొంతమైంది. రోడ్రిక్ (అమెరికా.. 2.12 మీటర్లు)కు స్వర్ణం దక్కగా 2 మీటర్ల ఎత్తుకు ఎగిరిన జియార్గికి కాంస్యం నెగ్గాడు.
పురుషుల డిస్కస్ త్రో ఎఫ్56లో భారత అథ్లెట్ కథునియా యోగేశ్.. 42.22 మీటర్ల త్రో విసిరి రెండో స్థానంలో నిలిచి వెండి వెలుగులు పంచాడు. టోక్యోలోనూ సిల్వర్ దక్కించుకున్న యోగేశ్.. పారిస్‌లోనూ సత్తా చాటాడు. బ్రెజిల్ అథ్లెట్ బాటిస్ట క్లాడినీ (46.86 మీటర్లు) గోల్డ్ మెడల్ కొట్టగా గ్రెనెడాకు చెందిన కాన్సాంటినోస్ (41.32) కాంస్యం నెగ్గాడు.
పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్3 కేటగిరిలో భారత్ స్వర్ణ పతకాన్ని నిలుపుకుంది. టోక్యోలో ఇదే కేటగిరీలో ప్రమోద్ భగత్ పసిడి పట్టుకురాగా పారిస్‌లో నితేశ్ దానిని నిలబెట్టాడు. సోమవారం జరిగిన ఫైనల్ పోరులో నితేశ్ 21-14, 18-21, 23-21తో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి గేమ్‌లో 6-9తో వెనుకవడ్డ నితేశ్ తర్వాత పుంజుకున్నాడు. అద్భుతమైన డిఫెన్స్‌కు తోడు వరుస పాయింట్లు సాధించుకుంటూ మొదటి గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లోనూ 14-12తో ఆధిక్యంలో ఉన్నా బెతెల్ అనూహ్యంగా పుంజుకుని ఆ గేమ్‌ను సొంతం చేసుకోవడంతో పోరు ఆసక్తికరంగా మారింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇరువురు హోరాహోరిగా పోరాడారు. స్కోరు 21-20 వద్ద ఉండగా బెతెల్‌కు మ్యాచ్ పాయింట్ వచ్చినా అతడు దానిని సద్వినియోగం చేసుకోలేదు. కానీ నితేశ్ మాత్రం ఆ తప్పునకు ఆస్కారం ఇవ్వకుండా గేమ్‌తో పాటు పసిడినీ చేజిక్కించుకున్నాడు. గత పారాలింపిక్స్‌లో రజతం నెగ్గిన సుహాస్.. పారిస్‌లోనూ అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు. పురుషుల సింగిల్స్ ఎస్‌ఎల్4 కేటగిరీ గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో సుహాస్ 9-21, 13-21తో లుకాస్ మజూర్ (ఫ్రాన్స్) చేతిలో పరాభవం పాలై సిల్వర్ మెడల్‌కు పరిమితమయ్యాడు. మరో కాంస్య పతక పోరులో సుకాంత్ కదమ్ నిరాశపరిచాడు.
ఆర్చరీ మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ కాంస్య పోరులో భారత్ (రాకేశ్ కుమార్, శీతల్ దేవి) 156-155తో ఇటలీని ఓడించింది. క్వార్టర్స్‌లో ఇండోనేషియాను ఓడించి సెమీస్ చేరిన భారత్.. ఇరాన్‌తో హోరాహోరిగా పోరాడినప్పటికీ మిల్లిమీటర్ల దూరం తేడాతో ఫైనల్స్ అవకాశాన్ని కోల్పోయింది. కానీ కాంస్య పోరులో మాత్రం రాకేశ్, శీతల్ గురి తప్పలేదు.
పారాలింపిక్స్‌లో తెలంగాణ యువ అథ్లెట్ జివాంజీ దీప్తి మహిళల 400మీ టీ20 రేసులో ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన హీట్స్-1లో దీప్తి 55.45 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ట్రాక్‌పై చిరుతను తలపించిన ఈ కల్లెడ అమ్మాయి.. అందరికంటే ముందు రేసును పూర్తి చేసింది. ఆదిలోనే జోరు కనబరిచిన దీప్తి..ప్రత్యర్థి రేసర్లకు అందనంత దూరంలో పరిగెత్తుతూ లక్ష్యాన్ని చేరుకుంది. ఆఖర్లో ఒకింత నెమ్మదించినా..నంబర్‌వన్‌తో తుది పోరులో నిలిచింది. మంగళవారం రాత్రి జరిగే ఆఖరి రేసులో ఇదే రీతిలో సత్తాచాటితే దీప్తి ఖాతాలో పతకం పక్కా చేరినట్లే.
2024-09-02T23:34:04Z dg43tfdfdgfd