PAK vs BAN : పాకిస్థాన్‌పై తొలి టెస్టు విజయంతో చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్(Bangladesh) రెండో టెస్టులో పట్టు బిగించింది.
రావల్పిండిలో బంగ్లాదేశ్ పేసర్ల ధాటికి పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. బౌన్స్, పేస్‌తో అదరగొట్టిన బంగ్లా పేసర్లు ఏకంగా పదికి పది వికెట్లు పడగొట్టారు. హసన్ మహమూద్(5/43), నహిద్ రానా(4/44)లు నిప్పులు చెరగడంతో, ఆతిథ్య పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 172కే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ మొదలెట్టిన బంగ్లా వికెట్ పడకుండా 42 రన్స్ కొట్టింది. ఐదో రోజు బంగ్లా విజయానికి 143 పరుగులు అవసరం.
స్వదేశంలో పాకిస్థాన్ ఆట మారలేదు. బంగ్లాదేశ్‌పై తొలిసారి ఓడి విమర్శల పాలైన పాక్ క్రికెటర్లు మళ్లీ అదే పొరపాటు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కనీస పోరాటం చేయలేదు. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై హసన్ మహమూద్(5/43), నహిద్ రానా (4/44)లు రెచ్చిపోయారు. వరుసపెట్టి వికెట్లు తీస్తూ పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశారు.
హసన్, నహిద్‌ల ధాటికి అందరూ పెవిలియన్ క్యూ కట్టగా.. అఘా సల్మాన్(47 నాటౌట్), మహ్మద్ రిజ్వాన్(43)లు కాసేపు ప్రతిఘటించారు. కానీ, హసన్మ లైన్ అండ్ లెంగ్త్‌తో రిజ్వాన్‌తో పాటు టెయిలెండర్ల పని పట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో బంగ్లాదేశ్ పేసర్లు ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీయడం ఇదే తొలిసారి.
అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లా ఓపెనర్లు షద్మాన్ ఇస్లాం(9 నాటౌట్), జకీర్ హసన్(31)లు ఆచితూచి ఆడారు. దాంతో, నాలుగో రోజు ఆట ముగిసే సరికి పర్యాటక జట్టు 42 పరుగులు చేసింది. చారిత్రక విజయానికి బంగ్లాకు ఐదో రోజు 143 రన్స్ కావాలంతే. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పాక్ ఓటమి తథ్యమే అంటున్నారు క్రీడా పండితులు.