NITU GHANGHAS | మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం నెగ్గిన నీతూ

న్యూఢిల్లీ: 2023 మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో 22 ఏళ్ల భారత బాక్సర్‌ నీతూ గంగాస్‌ సత్తా చాటింది. శనివారం జరిగిన ఫైనల్లో మంగోలియా బాక్సర్‌ లుత్సాయిఖాన్‌ అట్లాంట్సెట్‌సెగ్‌ను 5-0 తేడాతో మట్టి కరిపించి పసిడి పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. మహిళల 48 కిలోల విభాగంలో నీతూ తన పంచ్‌ పవర్‌ చూపించి ఈ ఘనత సాధించింది.

మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారిగా ఫైనల్‌ ఆడిన నీతూ గంగాస్‌.. బౌట్‌ ప్రారంభంతోనే ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. తొలి రౌండ్‌లో మంగోలియన్‌ బాక్సర్‌కు ఎక్కడా సందు దొరకనీయలేదు. ఈ టోర్నీలో గంగాస్‌.. కొరియా బాక్సర్‌ కాంగ్‌ డియోయాన్‌ను ఓడించడం ద్వారా తన జైత్రయాత్రను ప్రారంభించింది.

క్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన వడా మడోకాను మట్టికరిపించి సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో అలువా బెల్కిబెకోవాపై 5-2 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి ఫైనల్లో ప్రవేశించింది.

2023-03-25T13:40:46Z dg43tfdfdgfd