Nahid Rana In Google Trends: రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతోన్న రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం రెండు టెస్టుల అనుభవం మాత్రమే ఉన్న బంగ్లా పేసర్లు హసన్ మహముద్ (5 వికెట్లు), నహీద్ రాణా (4 వికెట్లు) పాకిస్థాన్ బ్యాటింగ్ విభాగాన్ని కుప్పకూల్చారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 172 పరుగులకే ఆలౌటయ్యింది. తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించిన పాకిస్థాన్ ప్రత్యర్థి ముంగిట 185 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో గంటకు 152 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసిన నహిద్ రాణా.. బంగ్లాదేశ్ చరిత్రలో అత్యంత ఫాస్ట్ బౌలర్‌గా రికార్డులకెక్కాడు. దీంతో అతడి పేరు గూగుల్‌లో ట్రెండ్ అయ్యింది.
వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటయ్యింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ సయీమ్ అయూబ్ (58), కెప్టెన్ మసూద్ (57), అఘా సల్మాన్ (54) మాత్రమే హాఫ్ సెంచరీలతో రాణించారు. బాబర్ ఆజమ్ 31 పరుగుతో ఫర్వాలేదనిపించగా.. రిజ్వాన్ 29 పరుగులు చేశాడు.
పాకిస్థాన్ ఆలౌటైన తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ పేలవ ఆటతీరు కనబర్చింది. కెరీర్లో మూడో టెస్టు ఆడుతున్న పాక్ యువ పేసర్ ఖుర్రం షహజాద్ (6 వికెట్లు) దెబ్బకు బంగ్లాదేశ్ 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో లిట్టన్ దాస్ (138), మెహదీ హసన్ మిరాజ్ (78) బంగ్లాదేశ్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు ఏకంగా 165 పరుగులు జోడించారు. మెహదీ హసన్ ఔటైనా.. లిట్టన్ దాస్ శతకంతో సత్తా చాటడంతో బంగ్లాదేశ్ ఊహించని రీతిలో కోలుకొని 262 పరుగులు చేయగలిగింది. ఓ దశలో 100 పరుగులు చేస్తే గొప్ప అనుకున్న బంగ్లా.. లిట్టన్, మెహదీ హసన్ దయతో పాకిస్థాన్ కంటే 12 పరుగులు మాత్రమే తక్కువ చేయగలిగింది.
మొదటి ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించిన పాకిస్థాన్ బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం చేతులెత్తేశారు. కెరీర్లో మూడో టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లా పేసర్లు హసన్ మహముద్ (5 వికెట్లు), నహిద్ రాణా (4 వికెట్లు) దెబ్బకు పాక్ విలవిల్లాడింది. ఓ దశలో పాక్ 81 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. కానీ రిజ్వాన్ (43), అఘా సల్మాన్ (47 నాటౌట్) ఆదుకోవడంతో 172 పరుగులైనా చేయగలిగింది.
అంతకు ముందు రావల్పిండి వేదికగానే జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌పై బంగ్లాకు ఇదే తొలి టెస్టు విజయం కావడం గమనార్హం. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 448/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. బదులుగా బంగ్లాదేశ్ 565 పరుగుల భారీ స్కోరు నమోదు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లా స్పిన్నర్ల దెబ్బకు పాకిస్థాన్ 146 పరుగులకే కుప్పకూలింది. దీంతో 30 పరుగుల స్వల్ప లక్ష్యా్న్ని ఊదేసిన బంగ్లా రికార్డు విజయాన్ని అందుకుంది. ఇప్పుడు రెండో టెస్టులోనూ బంగ్లాదేశ్ గెలిస్తే.. సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకుంటుంది. అదే జరిగితే పాకిస్థాన్ క్రికెట్ అధోఃపాతాళానికి పడిపోయినట్టే భావించాల్సి ఉంటుంది.