MS DHONI: తలా స్వాగ్.. బైక్ రైడింగ్‌లో ధోనీ! చెప్పినట్టే ఎంజాయ్ చేస్తున్నాడుగా!!

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎంజాయ్‌మెంట్‌‌లో మునిగిపోయాడు. ఐపీఎల్ 2025 సీఎస్కే లాస్ట్ మ్యాచ్‌లో చెప్పిన విధంగానే బైక్ రైడింగ్‌ మొదలుపెట్టాడు. నైట్ ప్యాంట్ - టీ షర్ట్ వేసుకుని చాలా సింపుల్‌గా బైక్‌పై వెళ్తూ కనిపించాడు. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎంఎస్ ధోనీకి బైక్స్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్కెట్‌లోకి ఏ కొత్త మోడల్ వచ్చినా అది ధోనీ ఇంట్లో ఉండాల్సిందే. చాలా ఇంటర్వ్యూల్లో తనకు బైక్ రైడింగ్ చేయడమంటే చాలా ఇష్టమని చెప్పాడు. ఖాళీ సమయం దొరికితే బైక్ తీసుకుని రాంచీ వీధుల్లో చక్కర్లు కొడతానని చెప్పాడు. హైవేపై షికారుకు వెళ్తూ రోడ్డు మీద కనిపించిన వాళ్లతో సెల్ఫీలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో సీఎస్కే విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం అవార్డు డిస్ట్రిబ్యూషన్ సమయంలో హర్ష భోగ్లేని ధోనీని రిటైర్మెంట్ గురించి అడిగాడు. ఆ సమయంలో ధోనీ మాట్లాడుతూ ముందు అర్జెంట్‌గా రాంచీ వెళ్లి అక్కడ నుంచి బైక్ రైడింగ్ స్టార్ట్ చేయాలని, ఆ తర్వాతే ఇంకేమైనా ఆలోచిస్తానని చెప్పాడు. సరిగ్గా చెప్పినట్టుగానే ఐపీఎల్ ముగిసిన తర్వాత ఎంఎస్ ధోనీ ఇలా బైక్ రైడింగ్ చేస్తూ కనిపించాడు.

కవాసకి బైక్ మీద నైట్ ప్యాంట్, టీషర్ట్, షూ వేసుకుని చాలా సింపుల్‌గా వెళ్లాడు. వెనుక ఒక బ్యాగ్ కూడా తగిలించుకున్నాడు. ఆ బ్యాగ్‌లో బట్టలు సర్దుకుని బహుశా తనకు నచ్చినన్ని రోజులు అలా సరదాగా విహరించి వచ్చేస్తాడేమో. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పిన ధోనీ తన జీవితాన్ని తనకు నచ్చినట్టు గడుపుతున్నాడు. లెఫ్టినెంట్ కల్నల్‌గా ఆర్మీలో ధోనీకి హోదా కూడా ఉంది.

ఐపీఎల్ లేని సమయంలో ధోనీ తన సొంత ఫార్మ్ హౌస్‌లో వ్యవసాయం కూడా చేస్తుంటాడు. ఆ మధ్య ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నుతూ కూడా ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ పలికిన ధోనీ.. ఒక్క ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. 2013 తర్వాత ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నా.. అభిమానుల కోరిక మేరకు ఇంకా సీఎస్కేలోనే కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026లో కూడా ధోనీ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

2025-06-06T07:12:57Z