Marathan Runner : పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న మారథాన్ రన్నర్‌కు ఊహించని షాక్. ఉగాండాకు చెందిన రెబెక్కా చెప్టెగీ (Rebecca Cheptegi) గృహ హింసకు గురైంది. ఈ క్రమంలోనే బాయ్‌ఫ్రెండ్ ఆమెకు నిప్పు అంటించాడు. ఒంటిపై పెట్రోల్ (Petrol)పోసి రెబెక్కాను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే.. మంటలకు తట్టుకోలేక హాహాకారాలు చేసిన ఆమెను స్థానికులు కెన్యాలోని |హాస్పిటల్‌కు తరలించారు. 75 శాతం కాలిన గాయాలు కావడంతో ఆమె దవాఖానాలో చావుబతులకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
కెన్యాకు చెందిన డిక్సన్ డియెమ మరగచ్‌తో 33 ఏండ్ల రెబెక్కా కొన్ని రోజులుగా సహజీవనం చేస్తోంది. అయితే.. తరచూ అతడు ఆమెను వేధింపులకు గురి చేసేవాడని ఇరుగుపొరుగు చెబుతున్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 1, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆమెపై అతడు దాష్టీకానికి పాల్పడ్డాడు. ఉన్మాదిలా మారిన అతడు రెబెక్కాను అంతమొందించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
ఏం జరుగుతుందో తెలిసే లోపే ఒళ్లంతా మంటలు వ్యాపించడంతో రెబెక్కా కాపాడంటూ ఆర్తనాదాలు చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. రెబెక్కాపై దాడి విషయం తెలిసి ఉగాండా ప్రజలతో పాటు ఒలింపిక్ సంఘం(IOA) కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మధ్యే ముగిసిన పారిస్ విశ్వ క్రీడల్లో రెబెక్కా మారథన్‌లో పతకం గెలవలేదు. పోటీలో ఆమె 44వ స్థానంలో నిలిచింది.