MANIKA BATRA | లక్ష్యం వైపు వడివడిగా.. ప్రిక్వార్టర్స్‌కు మనికా, శ్రీజ

  • సాత్విక్‌ జోడీ దూకుడు
  • ఆర్చరీలో మిశ్రమ ఫలితాలు

Manika Batra | పారిస్‌: భారీ ఆశలతో పారిస్‌కు వెళ్లిన భారత బృందం పతకాల రేసులో వడివడిగా ముందుకు సాగుతోంది. నాలుగో రోజు భారత్‌కు రెండో పతకం దక్కడంతో పాటు పలు క్రీడాంశాలలో మన అథ్లెట్లు విజయాలతో తదుపరి రౌండ్‌కు ముందంజ వేశారు. టేబుల్‌ టెన్నిస్‌లో మనికా బాత్ర, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లగా క్వార్టర్స్‌ బెర్తును ఖాయం చేసుకున్న బ్యాడ్మింటన్‌ పురుషుల ద్వయం సాత్విక్‌-చిరాగ్‌ గ్రూప్‌ దశలో చివరి మ్యాచ్‌ను తమ దూకుడుతో ఏకపక్షంగా మార్చేశారు. హాకీలో ఐర్లాండ్‌పై నెగ్గిన ‘మెన్‌ ఇన్‌ బ్లూ’ నాకౌట్‌ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. ఆర్చరీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి.

మనిక, శ్రీజ సరికొత్త చరిత్ర

టేబుల్‌ టెన్నిస్‌లో భారత్‌కు పతకం మీద ఆశలు రేపుతున్న ప్యాడ్లర్లలో మనికా బాత్రతో పాటు హైదరాబాదీ అమ్మాయి శ్రీజ ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. రౌండ్‌ ఆఫ్‌ 32లో మనికా 4-0 (11-9, 11-6, 11-9, 11-4)తో ఆతిథ్య ఫ్రాన్స్‌కు చెందిన ప్రితిక పవడెను ఓడించింది. భారత్‌ తరఫున ఒలింపిక్స్‌లో ప్రిక్వార్టర్స్‌ చేరిన తొలి ప్యాడ్లర్‌గా రికార్డులకెక్కింది. మనికాతో పాటు హైదరాబాదీ శ్రీజ.. 4-0 తో కలబెర్గ్‌ ను ఓడించి రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించింది.

సాత్విక్‌ జోడీ ధనాధన్‌

ఇప్పటికే క్వార్టర్స్‌ బెర్తును ఖాయం చేసుకున్న భారత స్టార్‌ షట్లర్‌ జోడీ సాత్విక్‌-చిరాగ్‌.. గ్రూప్‌ దశలో తమ చివరి మ్యాచ్‌ను ఏకపక్షంగా ముగించారు. గ్రూప్‌ సీ పురుషుల డబుల్స్‌ మూడో మ్యాచ్‌లో భారత ద్వయం.. 21-13, 21-13తో మహ్మద్‌ రియాన్‌-ఫజర్‌ అల్ఫియన్‌ (ఇండోనేషియా)పై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించి 38 నిమిషాల్లోనే మ్యాచ్‌ను పూర్తిచేశారు. మరోవైపు మహిళల డబుల్స్‌లో భారత జోడీ అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో 15-21, 10-21తో మపస-అంగెల (ఆస్ట్రేలియా) చేతిలో చిత్తైంది. మూడో మ్యాచ్‌లో ఓడి నిష్క్రమించింది.

భజన్‌ కౌర్‌ రాణించినా..

ఆర్చరీలో యువ భారత ఆర్చర్‌ భజన్‌ కౌర్‌ ప్రిక్వార్టర్స్‌కు చేరింది. మహిళల వ్యక్తిగత రౌండ్‌ ఆఫ్‌ 16 ఎలిమినేషన్‌ పోరులో కౌర్‌.. 6-0తో పోలండ్‌కు చెందిన మిస్జోర్‌ను ఓడించింది. వరుసగా మూడు సెట్లలో కౌర్‌ 28, 29, 28 స్కోరు చేయగా మిస్జోర్‌ 23, 26, 22 వద్దే ఆగిపోయింది.

బాక్సింగ్‌లో

భారత బాక్సర్‌ అమిత్‌ పంగల్‌ ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇంటిబాట పట్టాడు. పురుషుల 51 కిలోల ప్రిక్వార్టర్స్‌లో పంగల్‌ 1-4తో చిన్‌యెంబ(జాంబియా)కు తలవంచాడు. మహిళల బాక్సింగ్‌లో జాస్మిన్‌ లంబోరియా 0-5తో పెటికో చేతిలో ఓటమిపాలైంది.

బాల్‌రాజ్‌కు త్రుటిలో..

ఒలింపిక్స్‌ రోయింగ్‌ పోటీలలో బరిలోకి దిగిన ఏకైక రోయర్‌ బాల్‌రాజ్‌ పన్వర్‌ పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. పురుషుల సింగిల్స్‌ స్కల్స్‌ క్వార్టర్స్‌ రేసులో అతడు లక్ష్యాన్ని 7 నిమిషాల 5.10 సెకన్లలో పూర్తి చేసి ఐదో స్థానంతో ముగించాడు. పురుషుల ఆర్చరీ వ్యక్తిగత విభాగం రౌండ్‌ ఆఫ్‌-16లో యువ ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌ 5-6తో పీటర్స్‌(కెనడా) చేతిలో ఓటమిపాలయ్యాడు.

2024-07-30T21:15:17Z dg43tfdfdgfd