ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ 2026లో ఆ టీమ్ పరిస్థితి ఏంటి అనేది అయోమయ పరిస్థితిలో ఉంది. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన తర్వాత ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో 11 మంది అభిమానులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యి.. ఆర్సీబీని ఏకంగా ఎఫ్ఐఆర్‌లో చేర్చడమే కాకుండా మార్కెటింగ్ హెడ్‌ను కూడా అరెస్టు చేసింది. దాంతో ఆర్సీబీ ఎటూ తప్పించుకోలేని స్థితిలో ఉంది. ఇన్ని సంఘటన తర్వాత ఆర్సీబీపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరిలోనూ టెన్షన్ మొదలైంది.
బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా ఈ ఘటనపై ఇది వరకే స్పందించారు. విక్టరీ పరేడ్ అనేది ఆర్సీబీ ప్రైవేట్ కార్యక్రమం అయినప్పటికీ.. ఈ దేశంలో క్రికెట్ అనేది బీసీసీఐ అధీనంలో ఉందని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బీసీసీఐ చూస్తూ ఊరుకుండలేదని తేల్చి చెప్పారు. విచారణ పూర్తి అయిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా ఆర్సీబీ తోపులాట ఘటనపై స్పందించాడు. ఇలాంటివి జరగడం దురదృష్టకరమన్న ఆయన.. రోడ్ షోలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకపోవడమే మంచిదన్నాడు. అటు బీసీసీఐ, ఇటు గౌతమ్ గంభీర్ చెప్పిన దాని ప్రకారం వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లో కఠినతరమైన రూల్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. ఇప్పటికే తోపులాట ఘటనకు సంబంధించి పోలీసులు అరెస్టులు కూడా ప్రారంభించారు. ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్‌తో పాటు ఈవెంట్ ఆర్గనైజర్లను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఒకవేళ విచారణలో ఆర్సీబీదే కీలక పాత్ర అని తేలితే పోలీసులతో పాటు బీసీసీఐ కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
విచారణలో ఈ ఘటనకు ముఖ్య కారణం ఆర్సీబీ మేనేజ్‌మెంట్ అనే తేలితే బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంఛైజీలు కూడా వ్యాపార నేపథ్యంలోనే ఆటను చూస్తాయి.. కాకపోతే మ్యాచ్‌ల సమయంలో ఫ్యాన్స్ సేఫ్టీ ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఫ్రాంఛైజీలకు ఉంటుంది. ఒకవేళ విచారణలో ఆర్సీబీదే తప్పు అని తేలితే.. ఐపీఎల్ విశ్వసనీయత కాపాడే క్రమంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. భవిష్యత్‌లో ఏ ఫ్రాంఛైజీ కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం చేయకుండా ఒక ఏడాది పాటు బ్యాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
2025-06-09T05:54:52Z