IPL 2023 FINAL రిజర్వ్‌ డేకి వాయిదా.. అయినా వెంటాడుతున్న టెన్షన్

ఐపీఎల్ 2023 ఫైనల్ (IPL 2023 Final) రిజర్వ్ డేకి వాయిదాపడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య శనివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ.. సాయంత్రం నుంచి ఎడతెరపి లేని వర్షం కారణంగా కనీసం టాస్ కూడా సాధ్యంకాలేదు. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ప్లేయర్లతో పాటు అభిమానులు కూడా స్టేడియంలో నిరీక్షించారు. కానీ.. ఎంతకీ వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ని సోమవారానికి వాయిదా వేశారు. కానీ రేపు కూడా వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. దాంతో రెండు జట్లలోనూ టెన్షన్ మొదలైంది. ఒకవేళ సోమవారం కూడా మ్యాచ్ సాధ్యంకాకపోతే .. ఇరు జట్లనీ విజేతగా ప్రకటించి టైటిల్‌ని షేర్ చేస్తారు.

అహ్మదాబాద్‌లో గత కొన్ని రోజులుగా అకాల వర్షం కురుస్తోంది. గత శుక్రవారం కూడా ముంబయి, గుజరాత్ టీమ్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్-2కి అంతరాయం కలిగించింది. కానీ.. ఆ మ్యాచ్‌లో కేవలం అరగంట మాత్రమే మ్యాచ్ టైమ్ వేస్ట్ అయ్యింది. కానీ ఆదివారం పూర్తిగా మ్యాచ్ సమయాన్ని వర్షం తుడిచిపెట్టేసింది. మధ్యలో వర్షం కాస్త తగ్గుముఖం పట్టినా.. అప్పటికే ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా మారిపోయింది. దాంతో 11:30 గంటల వరకు ఓవర్ కుదింపుతో మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నా.. అరగంట ముందే గేమ్‌ని అంపైర్లు వాయిదా వేయక తప్పలేదు.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఫైనల్‌కి చేరడం ఇది పదోసారి. ధోనీ కెప్టెన్సీలోని ఆ జట్టు ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ గెలిచింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్‌కి చేరింది. గత ఏడాది ఆ జట్టు ఎవరూ ఊహించని విధంగా టైటిల్ ఎగరేసుకుపోయిన విషయం తెలిసిందే. హెడ్ టు హెడ్ రికార్డుల్లో గుజరాత్ టీమ్ 2-1తో చెన్నైపై ఆధిక్యంలో ఉంది.

2023-05-28T17:47:03Z dg43tfdfdgfd