IPL 2023: అక్షర్ పటేల్‌కు ప్రమోషన్.. ఢిల్లీని ముందుకు నడపనున్న ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు

ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ వ్యవహరించనున్నాడు. రిషబ్ పంత్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో.. అతడి స్థానంలో వార్నర్ జట్టును ముందుకు నడపనున్నాడు. గత సీజన్లో ఐదు హాఫ్ సెంచరీలు బాది, 150కిపైగా స్ట్రయిక్ రేట్‌తో 432 పరుగులు చేసిన వార్నర్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ తమ వైస్ కెప్టె్న్‌గా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను నియమించింది. ఇటీవల ముగిసిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో మూడు హాఫ్ సెంచరీలు చేసిన అక్షర్.. భారత్ సిరీస్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా అక్షర్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అతడికి ఢిల్లీ వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కిందని భావిస్తున్నారు.

‘రిషబ్ పంత్ టెర్రిఫిక్ లీడర్, అతడి సేవలను మేం కోల్పోతున్నాం. నా మీద నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు’ అని ఢిల్లీ కొత్త కెప్టెన్‌గా ఎంపికైన డేవిడ్ వార్నర్ ప్రకటించాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ ఎప్పటికీ తనదేనన్న వార్నర్.. ప్రతిభావంతులైన ఆటగాళ్లతో ఉన్న జట్టుకు నాయకత్వం వహించనుండటం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నాడు.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా వ్యవహరించడం వార్నర్‌కు కొత్తేమీ కాదు. అతడి సారథ్యంలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో టైటిల్ నెగ్గింది. 2022లో సన్‌రైజర్స్ వార్నర్‌ను రిలీజ్ చేయగా.. మెగా వేలంలో రూ.6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ అతణ్ని కొనుగోలు చేసింది.

వార్నర్‌కు సవాలే..

సన్‌రైజర్స్‌కు విజయవంతమైన సారథిగా పేరు తెచ్చుకున్న వార్నర్‌కు ఢిల్లీ కెప్టెన్సీ రూపంలో అసలైన సవాల్ ఎదురుకానుంది. పంత్ లాంటి ఆటగాడు దూరం కావడంతోపాటు.. వార్నర్ సైతం ఫామ్‌‌తో తంటాలు పడుతున్నాడు. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో రెండు టెస్టులు ఆడిన వార్నర్ మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 26 పరుగులే చేయగలిగాడు. ఢిల్లీ టెస్టులో వార్నర్ తలకు గాయం కావడంతో కంకషన్ సబ్‌స్టిట్యూట్ బరిలోకి దిగాల్సి వచ్చింది.

ఢిల్లీలోకి మళ్లీ గంగూలీ..

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి అడుగుపెట్టనున్నాడు. 2019 సీజన్లో ఢిల్లీ మెంటార్‌గా పని చేసిన గంగూలీ.. ఈసారి ఆ ఫ్రాంచైజీకి సంబంధించి క్రికెట్ వ్యవహారాల డైరెక్టర్‌గా వ్యవహరించనున్నాడు.

ఐపీఎల్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌లో లక్నో సూపర్ గెయింట్స్‌తో ఏప్రిల్ 1న తలపడనుంది.

2023-03-16T06:59:04Z dg43tfdfdgfd