IND VS SL | భారత్‌ సూపర్‌.. ఆఖరి టీ20లో ఉత్కంఠ విజయం

  • లంకపై 3-0తో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

IND vs SL | పల్లెకెలె : శ్రీలంక పర్యటనలో వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఇది వరకే సిరీస్‌ కైవసం చేసుకున్న యువ భారత జట్టు ఆఖరి టీ20లో బ్యాటింగ్‌ విభాగంలో తడబడ్డా బౌలర్లు రాణించడంతో సూపర్‌ ఓవర్‌లో అద్భుత విజయం సాధించింది. ఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో ‘సూపర్‌ ఓవర్‌’కు దారితీసిన ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియానే విజయం వరించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ టాపార్డర్‌, మిడిలార్డర్‌ వైఫల్యంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేయగలిగింది. 48 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత్‌ను వైస్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (39), లోయరార్డర్‌లో రియాన్‌ పరాగ్‌ (26) ఆరో వికెట్‌కు 54 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఆఖర్లో వాషింగ్టన్‌ సుందర్‌ (25) రాణించడంతో టీమ్‌ఇండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది.

అనంతరం స్వల్ప ఛేదనలో లంకేయులు సైతం తడబడ్డారు. 20 ఓవర్లు ఆడిన ఆ జట్టూ 137/8 వద్దే ఆగిపోయింది. ఓపెనర్లు పతుమ్‌ నిస్సంక (26), కుశాల్‌ మెండిస్‌ (43) తొలి వికెట్‌కు 58 పరుగులు జోడించి ఆ జట్టుకు శుభారంభం అందించారు. నిస్సంక ఔట్‌ అయినా కుశాల్‌ పెరీరా (46) ఆ జట్టును గెలిపించేందుకు యత్నించాడు. కానీ చివరి 5 ఓవర్లలో లంక 29 పరుగులు మాత్రమే రాబట్టి 7 వికెట్లు నష్టపోయింది. చివరి ఓవర్లో 6 పరుగులు కావాల్సి ఉండగా సూర్య 5 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్‌ టై అయింది. ఇక సూపర్‌ ఓవర్‌లో సుందర్‌..కుశాల్‌ పెరెరా(0), నిస్సంక(0)ను వరుస బంతుల్లో ఔట్‌ చేయడంతో లంక రెండు పరుగులకే ఆలౌటైంది. తీక్షణ వేసిన తొలి బంతినే సూర్యకుమార్‌ ఫోర్‌ కొట్టి జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. సుందర్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

2024-07-30T21:00:13Z dg43tfdfdgfd