టీ-20 సిరీస్‌లో నాలుగో మ్యాచ్ ఇవాళ పుణె వేదికగా జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్.. మూడో టీ-20లో చిత్తయింది. దీంతో ప్రస్తుం 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి సిరీస్ చేజిక్కించుకోవాలని చూస్తోంది. తొలి మ్యాచ్‌లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి ఇంగ్లాండ్‌ను చిత్తుచేయగా.. సిరీస్ ఈజీగానే భారత్ గెలుస్తుందనిపించింది. కానీ రెండో మ్యాచ్‌లో గెలుపు కోసం భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఇక మూడో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో భారత్ పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్.. రెట్టించిన ఉత్సాహంతో నాలుగో టీ-20 ఆడనుంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా.. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టింది. తొలుత ఇంగ్లాండ్‌ను 132 కే కట్టడి చేసి.. కేవలం 12.5 ఓవర్లలోనే విజయం సాధించింది. అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌తో (34 బంతుల్లో 79) అదరగొట్టాడు. ఇక రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని.. తిలక్ వర్మ (72) ఒంటరి పోరాటంతో భారత్‌ను గెలిపించాడు. ఇక మూడో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో ఎవరూ ఆకట్టుకోలేదు. దీంతో ఓడిపోయింది.ఈ క్రమంలో నాలుగో టీ-20లో భారత్ బ్యాటింగ్ మారకుంటే.. ఇంగ్లాండ్ మరో విజయం సాధించడం కష్టమేమీ కాదు. తొలి మ్యాచ్ బాగా ఆడిన అభిషేక్ శర్మ.. తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో రాణించలేదు. సౌతాఫ్రికాతో సిరీస్‌లో సెంచరీలతో అదరగొట్టిన మరో ఓపెనర్ సంజూ శాంసన్ వరుసగా 26,5,3 పరుగులే చేసి నిరాశపర్చాడు. మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 0, 12, 14 రన్స్ మాత్రమే చేశాడు. టీమిండియా గెలవాలంటే వీరు రాణించాల్సిన అవసరం ఉంది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వేగంగా ఆడాల్సి ఉంది. గత రెండు టీ-20లకు గాయం కారణంగా దూరమైన టీ-20 స్పెషలిస్ట్ రింకూ సింగ్ ఈ మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగనున్నాడు. మ్యాచ్‌కు ముందు అతడు ఫిట్‌నెస్ సాధించాడు. ముందు రోజు ప్రాక్టీస్ కూడా చేశాడు. ఇక రింకూ జట్టులోకి వస్తే ధ్రువ్ జురెల్ మళ్లీ తప్పుకోవాల్సి ఉంటుందని చెప్పొచ్చు. బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నాడు. గత మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శన సహా మొత్తం 10 వికెట్లు తీశాడు. అక్షర్ కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. ఇక వీరికి ఇతరుల నుంచి సరైన సహకారం లభించట్లేదు. రవి బిష్ణోయ్ ఎక్కువ పరుగులు ఇస్తూ.. వికెట్లు తీయలేకపోతున్నాడు. వాషింగ్టన్ సుందర్‌దీ అదే పరిస్థితి. ఈ మ్యాచ్‌లో సుందర్‌ను తప్పించి.. శివమ్ దూబే లేదా రమణ్‌దీప్ సింగ్‌ను తీసుకునే ఛాన్స్ ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ విఫలమవుతున్నాడు. గత మ్యాచ్‌లో రీఎంట్రీ ఇచ్చిన షమీ ఆకట్టుకోలేదు. దీనికి తోడు పుణె పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందన్న అంచనాల నేపథ్యంలో షమీని తప్పించి.. స్పెషలిస్ట్ పేసర్‌గా అర్ష్‌దీప్‌ను మాత్రమే ఆడించే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. మరోవైపు ఇంగ్లాండ్.. మ్యాచ్ మ్యాచ్‌కూ మెరుగవుతూ వస్తోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ జోస్ బట్లర్ నిలకడగా రాణిస్తున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అతడే టాప్ స్కోరర్‌గా (3 మ్యాచ్‌ల్లో 137 రన్స్) ఉన్నాడు. గత మ్యాచ్‌లో బెన్ డకెట్, లివింగ్‌స్టన్ మెరుగు ఇన్నింగ్స్ ఆడి గాడినపడ్డారు. ఇక మూడో మ్యాచ్ విజయం.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని చెప్పొచ్చు. విధ్వంసకర ప్లేయర్లు ఫిల్ సాల్ట్, హ్యారీ బ్రూక్ రెచ్చిపోతే ఇంగ్లాండ్‌ను అడ్డుకోవడం కష్టంగా మారుతుంది. ఇక బౌలింగ్‌లో కార్స్, ఆదిల్ రషీద్ నిలకడగా రాణిస్తూ వికెట్లు తీస్తున్నారు. వారికి జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్ చక్కగా సహకరిస్తున్నారు.