IND vs ENG : రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు నిప్పులు చెరుగుతున్నారు. మహ్మద్ సిరాజ్(1-29), ఆకాశ్ దీప్(1-21)ల ధాటికి ఇంగ్లండ్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోతోంది. క్రీజులో పాతుకుపోవాలనుకున్న జో రూట్(6)ను ఆకాశ్ బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టును కోలుకోలేని దెబ్బకొట్టాడు. ప్రస్తుతం ఓలీ పోప్(17), హ్యారీ బ్రూక్(2)లు క్రీజులో ఉన్నారు. రూట్ వెనుదిరగడంతో మూడు వికెట్ల నష్టానికి ఇంగ్లండ్ 52 రన్స్ చేసింది. ఇంకా స్టోక్స్ సేన విజయానికి 556 పరుగులు అవసరం కాగా భారత్‌కు ఏడు వికెట్లు కావాలి.
భారత్ నిర్దేశించిన 608 పరుగుల ఛేదనలో ఆతిథ్య జట్టుకు సిరాజ్ ఆదిలోనే షాకిచ్చాడు. డేంజరస్ ఓపెనర్ జాక్ క్రాలే(0)ను డకౌట్ చేసి టీమిండియాకు బ్రేకిచ్చాడు. ఆ తర్వాత ఆకాశ్ ధనాధన్ ఆడుతున్న బెన్ డకెట్(25)ను బౌల్డ్ చేసి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు. 30 పరుగులకే ఓపెనర్లు నిష్క్రమణతో స్టోక్స్ సేన ఆత్మరక్షణలో పడింది.
లీడ్స్‌లో చేజేతులా ఓడిన టీమిండియా ఎడ్జ్‌బాస్టన్‌లో ఆధిపత్యం చెలాయిస్తూ డ్రైవర్ సీట్లో ఉంది. నాలుగో రోజు తొలి సెషన్‌లో కొత్త బంతితో ఇంగ్లండ్ బౌలర్లు కట్టడి చేసినా కేఎల్ రాహుల్(55) సంయమనంతో ఆడుతూ స్కోర్‌బోర్డును ఉరికించాడు. కరుణ్ నాయర్(26)ను ఔట్ చేసిన కార్సే బ్రేకివ్వగా.. కాసేపటికే టంగ్ రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఇంగ్లండ్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. కానీ, స్టోక్స్ సేన సంబురాన్ని ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(61) విధ్వంసక బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లను హడలెత్తించాడు. గిల్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో 608 పరుగుల భారీ లక్ష ఛేదనకు సిద్ధమైంది ఇంగ్లండ్.
2025-07-05T17:25:47Z