IND vs ENG : ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో సగం వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ కోలుకుంది. భారత పేసర్లను ఎదుర్కోలేక స్టార్ ఆటగాళ్లు పెవిలియన్ చేరినా కుర్రాళ్లు మాత్రం మొక్కవోని పట్టుదలతో క్రీజులో నిలిచారు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో హ్యారీ బ్రూక్(91 నాటౌట్), వికెట్ కీపర్ జేమీ స్మిత్(102 నాటౌట్) బజ్ బాల్ ఆటతో చెలరేగిపోయారు. లీడ్స్‌లో ధనాధన్ ఆడిన ఈ ఇద్దరూ మరోసారి ఆతిథ్య జట్టుకు ఆపద్భాందవులయ్యారు.
సిరాజ్ హ్యాట్రిక్‌ను అడ్డుకున్న స్మిత్ విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. 80 బంతుల్లోనే సెంచరీకి చేరవైన అతడు తాను ఫ్యూచర్ స్టార్ అని మరోసారి నిరూపించుకున్నాడు. బ్రూక్, స్మిత్‌లు ఆరో వికెట్‌కు కేవలం 154 బంతుల్లోనే అబేధ్యమైన 165 పరుగులతో జట్టును ఒడ్డున పడేశారు. వీరిద్దరి మెరుపులతో వికెట్ల పతనానికి బ్రేక్ పడగా.. లంచ్ సమయానికి ఇంగ్లండ్ ఐదు వికెట్ల నష్టానికి 249 రన్స్ చేసింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో స్టోక్స్ సేన 338 పరుగులు వెనకబడి ఉంది.
తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కొట్టిన భారత జట్టు మ్యాచ్‌పై పట్టుబిగించే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. మూడోరోజు తొలి సెషన్‌లో సిరాజ్ ఒకే ఓవర్లో డేంజరస్ జో రూట్(22), బెన్ స్టోక్స్(0)లను ఔట్ చేసి ఆతిథ్య జట్టును గట్టి దెబ్బ కొట్టగా.. 84 కే ఐదు వికెట్లు పడ్డాయి. కానీ, ఆ తర్వాత భారత బౌలర్లు తేలిపోయారు. హ్యారీ బ్రూక్(91 నాటౌట్)కు తోడైన జేమీ స్మిత్(102 నాటౌట్) బౌండరీలతో హోరెత్తించాడు.
ప్రసిధ్ కృష్ణ ఓవర్లో 23 రన్స్ పిండుకున్న అతడు హాఫ్ సెంచరీ తర్వాత మరింత చెలరేగాడు. మరోవైపు బ్రూక్ కూడా జోరు పెంచడంతో ఇంగ్లండ్ స్కోర్ బోర్డు రాకెట్‌లా దూసుకెళ్లింది. బజ్ బాల్ గేమ్‌తో ఆతిథ్య జట్టును పటిష్ట స్థితిలో నిలిపిన ఈ జోడీ ఆరో వికెట్‌కు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో, ఇంగ్లండ్ స్కోర్ 240 దాటింది. భోజన విరామం తర్వాత వీళ్లను అడ్డుకోకుంటే ఇంగ్లండ్ అవకాశాలు మెరుగుపడడం ఖాయం. సో.. రెండో సెషన్‌లో మ్యాచ్ టీమిండియా వైపు తిరగాలంటే చకచకా వికెట్లు తీయాల్సిందే.