IND VS ENG | అజేయంగా నిలిచిన రాహుల్, నాయర్.. భారీ ఆధిక్యం దిశగా టీమిండియా

IND vs ENG : అండర్సన్ – టెండూల్కర్ ట్రోఫీ రెండో టెస్టులో భారత జట్టు పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో మహ్మద్ సిరాజ్(6-70) విజృంభణతో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (28) ధనాధన్ ఆడగా.. కేఎల్ రాహుల్(28 నాటౌట్) కవర్ డ్రైవ్‌లతో అలరించాడు. యశస్వీ ఔటయ్యాక కరుణ్ నాయర్(7 నాటౌట్) ఈసారి ఏ పొరపాటు చేయలేదు. దాంతో, మూడో రోజు ఆట ముగిసే సరికి గిల్ బృందం వికెట్ నష్టానికి 64 రన్స్ చేసింది. ప్రస్తుతానికి భారత్ 244 పరుగుల ఆధిక్యంతో మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరుకుంది.

తొలి ఇన్నింగ్స్‌లో భారత పేసర్ల ధాటికి 85 కే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను హ్యారీ బ్రూక్(158), జేమీ స్మిత్‌(184 నాటౌట్)లు ఆదుకోగా.. టీ సెషన్ తర్వాత కొత్త బంతితో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు ఆకాశ్ దీప్. బ్రూక్‌ను బౌల్డ్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టాడు. ఆ తర్వాత సిరాజ్ తన పేస్ పవర్ చూపిస్తూ టెయిలెండర్లను పెవిలియన్ చేర్చాడు. దాంతో, ఇంగ్లండ్ 407కే కుప్పకూలగా ఇండియాకు 180 పరుగుల ఆధిక్యం లభించింది.

యశస్వీ జైస్వాల్‌(28)

 

రెండో ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్‌(28) ఉన్నంత సేపు బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే.. జోష్ టంగ్ ఓవర్లో ఔండరీ బాదిన అతడు నాలుగో బంతికి ఎల్బీగా వెనుదిరిగాడు. అయితే.. రివ్యూ ఆలస్యంగా తీసుకోవడంతో ఇంగ్లండ్ సారథి బెన్ స్టోక్స్ అంపైర్‌తో వాగ్వావాదానికి దిగాడు. అయినా సరే రివ్యూను అంగీకరించిన టీవీ అంపైర్ రీప్లేలో చూడగా బంతి లెగ్‌స్టంప్‌ను తాకింది. దాంతో, 50 పరగులు భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కేఎల్ రాహుల్(28), కరుణ్ నాయర్(7) లు మరో వికెట్ పడకుండా చూసుకోగా.. భారత్ వికెట్ నష్టానికి 64 రన్స్ కొట్టింది.

2025-07-04T17:55:46Z