IND VS AUS: భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్ ఇరుజట్లకు ఎందుకంత ముఖ్యమైనది?

ఈ ఏడాది చివర్లో జరగనున్న ఐసీసీ క్రికెట్ పురుషుల ప్రపంచకప్‌కు ముందు టీమిండియా తమ బలాలు, బలహీనతలను పరీక్షించుకునేందుకు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఈ వన్డే సిరీస్ సువర్ణావకాశం.

ఇటీవల బోర్డర్-గావస్కర్ టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో పర్యాటక ఆస్ట్రేలియాను ఓడించడం భారత జట్టుకు సానుకూలాంశం.

ప్రపంచ క్రికెట్‌లో రెండు బలమైన జట్లుగా ఉన్న భారత్, ఆసీస్‌లకు రాబోయే ప్రపంచ‌కప్‌‌కు సిద్ధమవడానికి ఈ సిరీస్ ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు.

భారత్-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో, రెండో వన్డే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో, మూడో వన్డే చెన్నైలో జరుగుతాయి.

మ్యాచ్‌ల షెడ్యూల్:

మొదటి వన్డే – 17 మార్చి 2023 (శుక్రవారం) (1.30 PM)

రెండో వన్డే – 19 మార్చి 2023 (ఆదివారం) (1.30 PM)

మూడో వన్డే – 22 మార్చి 2023 (బుధవారం) (1.30 PM)

భారత్, ఆస్ట్రేలియా జట్లలో ఎవరి బలమెంత?

ఐసీసీ వన్డే ర్యాంకింగ్ పరిశీలిస్తే ప్రస్తుతం టీమిండియా 114 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఆస్ట్రేలియా 112 రేటింగ్‌ పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని నిలుపుకుంటుందా లేదా అనేది ఈ సిరీస్ ఫలితం మీద ఆధారపడి ఉంది.

2022-23 ఏడాదిలో న్యూజీలాండ్, బంగ్లాదేశ్‌లలో పర్యటించినప్పుడు వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా స్వదేశంలో శ్రీలంక, న్యూజీలాండ్‌లపై గెలిచింది.

భారత్, న్యూజీలాండ్ సిరీస్ (3 మ్యాచ్‌లు)- (విజేత) న్యూజీలాండ్ 1-0

భారత్, బంగ్లాదేశ్ సిరీస్ (3 మ్యాచ్‌లు) - (విజేత) బంగ్లాదేశ్ 2-1

భారత్, శ్రీలంక సిరీస్ (3 మ్యాచ్‌లు) - (విజేత) భారత్ 3-0

భారత్, న్యూజీలాండ్ సిరీస్ (3 మ్యాచ్‌లు) - (విజేత) భారత్ 3-0

2022-23 ఏడాదిలో కంగారూ జట్టు ప్రదర్శన పరిశీలిస్తే సొంత గడ్డపై ఇంగ్లాండ్, న్యూజీలాండ్, జింబాబ్వే జట్లను మట్టికరిపించింది. అదే సమయంలో శ్రీలంకలో పర్యటించి సిరీస్ చేజార్చుకుంది.

శ్రీలంక - ఆస్ట్రేలియా సిరీస్ (5 మ్యాచ్‌లు) - (విజేత) శ్రీలంక 3-2

జింబాబ్వే - ఆస్ట్రేలియా సిరీస్ (3 మ్యాచ్‌లు) - (విజేత) ఆస్ట్రేలియా 2-1

న్యూజీలాండ్ - ఆస్ట్రేలియా సిరీస్ (3 మ్యాచ్‌లు) - (విజేత) ఆస్ట్రేలియా 3-0

ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా సిరీస్ (3 మ్యాచ్‌లు) - (విజేత) ఆస్ట్రేలియా 3-0

ఇటీవలే శ్రీలంకతో స్వదేశంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 317 పరుగుల భారీ తేడాతో గెలిచి రికార్డు సృష్టించింది.

భారత్, ఆస్ట్రేలియా, ఓ కెప్టెన్సీ..

టీమిండియా కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి వైదొలిగినప్పటి నుంచి భారత జట్టులో కెప్టెన్ల మార్పు కనిపిస్తోంది.

రోహిత్ శర్మతో పాటు సీనియర్ బ్యాట్స్‌మన్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లు కూడా భారత జట్టుకు కెప్టెన్‌‌లుగా వ్యవహరించారు.

ఈసారి ఆస్ట్రేలియాతో జరిగే మొదటి వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాలతో ఆడటం లేదు.

దీంతో ఇప్పటికే టీ20 జట్టుకు కెప్టెన్సీ వహించిన హార్దిక్ పాండ్యా మొదటిసారి భారత వన్డే జట్టుకు నాయకత్వం వహించాడు.

మిగతా రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా తిరిగి రానున్నాడు.

మరోవైపు, ఆస్ట్రేలియా జట్టు కూడా భారత్‌లాగే కెప్టెన్సీ కోసం వేర్వేరు ఆటగాళ్లకు బాధ్యతలు అప్పగించాల్సి వస్తోంది.

గత ఐదు వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియాకు నలుగురు ఆటగాళ్లు నాయకత్వం వహించారు.

సెప్టెంబరులో ఆరోన్ ఫించ్ దిగిపోయిన తర్వాత పాట్ కమిన్స్ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

అయితే ఇంగ్లండ్‌తో సిరీస్‌లో రెండో మ్యాచ్‌లో పాట్ కమిన్స్ కు విశ్రాంతి ఇచ్చారు. దీంతో నవంబర్‌లో జోస్ హేజిల్‌వుడ్ కెప్టెన్సీని చేపట్టాడు.

ఇప్పుడు కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేడు. దీంతో 51 మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన స్టీవ్ స్మిత్‌కు జట్టు పగ్గాలు అప్పగించారు.

ఆటగాళ్ల గాయాలు ఇరు జట్లకు తలనొప్పిగా మారుతాయా?

భారత జట్టు స్టార్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఇప్పటికే జూన్ వరకు జట్టుకు దూరమయ్యాడు.

అలాగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్ట్ మ్యాచ్‌లో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు.

మరోవైపు, ఆసీస్ కీలక బౌలర్ హేజిల్‌వుడ్ కూడా గాయం కారణంగా ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్‌కి దూరమయ్యాడు.

స్టార్ ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ కూడా గత నవంబర్ నుంచి గాయంతో జట్టుకు దూరంగా ఉన్నాడు. వచ్చే 3 మ్యాచ్‌లలో మాక్సీ ఆస్ట్రేలియాకు అందుబాటులో ఉంటాడో లేడో స్పష్టత కొరవడింది.

ఇలా రెండు జట్లూ ఒకే విధమైన సవాళ్లతో బరిలోకి దిగనుండటంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోటీ జరగనుంది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

2023-03-17T14:29:46Z dg43tfdfdgfd