ICC TEST RANKINGS | నెంబర్‌ వన్‌ టెస్ట్‌ బౌలర్‌గా అశ్విన్‌.. అద్భుత ఇన్సింగ్స్‌తో దూసుకొచ్చిన విరాట్‌ కోహ్లీ

ICC Test Rankings | భారత – ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ టెస్ట్‌ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఐసీసీ ర్యాక్సింగ్‌ (ICC Test Rankings) లో దూసుకెళ్లారు. ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ నెంబర్‌ వన్‌ బౌలర్‌గా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. ఇంతకు ముందు జేమ్స్‌ అండర్సన్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఆసిస్‌తో జరిగిన సిరీస్‌లో 28 సగటుతో 25 వికెట్లు పడగొట్టి.. రవీంద్ర జడేతాతో కలిసి ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. దాంతో ర్యాకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ క్రికెటర్‌ జేమ్స్‌ అండర్సన్‌ను వెనక్కి నెట్టి.. అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు. ఇక కంగారులతో జరిగిన చివరి టెస్టులో 186 పరుగులతో అద్భుత ఇన్సింగ్‌ ఆడిన విరాట్‌ కోహ్లీ తన ర్యాకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నాడు. ఏడు స్థానాలను మెరుగుపరుచుకొని 13వ స్థానానికి ఎగబాకాడు.

దాదాపు 1205 రోజుల తర్వాత విరాట్‌ అద్భుతమైన ఇన్సింగ్స్‌ను ఆడి డబుల్‌ సెంచరీకి కొన్ని పరుగుల దూరంలో పెవిలియన్‌కు చేరాడు. బ్యాటర్ల ర్యాక్సింగ్స్‌లో భారత ఆటగాడు రిషబ్‌ పంత్‌ తొమ్మిదో స్థానంలో నిలువగా.. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే సిరీస్‌లో బ్యాటింగ్‌తో అద్భుత ప్రదర్శన చేసిన అక్షర్‌ పటేల్‌ బ్యాటింగ్‌ ర్యాకింగ్స్‌లో ఎనిమిది స్థానాలను మెరుగుపరుచుకొని 44వ స్థానానికి చేరాడు. అలాగే ఆల్‌ రౌండర్ల ర్యాకింగ్స్‌లో ఒక స్థానం ఎగబాకి నాలుగో స్థానానికి చేరాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్‌ 264 పరుగులు సాధించాడు. టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ఉస్మాన్ ఖవాజా రెండు స్థానాలు మెరుగుపడి ఏడో స్థానానికి చేరాడు. ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ బ్యాట్స్‌మెన్ లిస్ట్‌లో 11 స్థానాలు ఎగబాకి 26వ ర్యాంక్‌కు చేరాడు. ట్రావిస్ హెడ్ 853 రేటింగ్ పాయింట్లతో టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తన ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

క్రైస్ట్‌చర్చ్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ టిమ్ సౌథీ ఏడు వికెట్లు తీసి టెస్టు బౌలర్ల జాబితాలో ఆరు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరాడు. డారిల్ మిచెల్ 102 పరుగులు చేసి టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో నాలుగు స్థానాలు ఎగబాకాడు. టెస్ట్‌ సిరీస్‌లో వెస్టిండీస్‌ను వైట్‌వాష్ చేసిన తర్వాత దక్షిణాఫ్రికా కొత్త కెప్టెన్ టెంబా బావుమా బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో 14 స్థానాలు ఎగబాకి 15వ స్థానానికి చేరుకోగా, ఐడెన్ మార్క్రామ్ 11 స్థానాలు మెరుగై.. 22వ ర్యాంక్‌కు చేరాడు. వెస్టిండీస్ క్రికెటర్‌ కైల్ మేయర్ 10 స్థానాలు ఎగబాకి బౌలర్లలో 32వ స్థానానికి, ఆల్ రౌండర్లలో ఏడో స్థానానికి చేరాడు. బంగ్లాదేశ్, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన సిరీస్‌లో రాణించిన ఆటగాళ్లు సైతం ర్యాకింగ్స్‌ను మెరుగుపరుచుకున్నారు.

2023-03-15T11:50:20Z dg43tfdfdgfd