ICC Rankings : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ (Joe Root) మళ్లీ టెస్టుల్లో వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సాధించాడు. ఈ మధ్యే సుదీర్ఘ ఫార్మాట్‌లో 32వ సెంచరీతో పాటు 12వేల పరుగుల క్లబ్‌లో చేరిన రూట్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ఐసీసీ తాజాగా టెస్టు బ్యాటింగ్, బౌలింగ్, ఆల్‌రౌండ్ ర్యాంక్‌లను ప్రకటించింది.
విండీస్‌పై మూడు టెస్టుల సిరీస్‌లో 291 రన్స్ బాదిన రూట్ నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకోగా.. న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్(Kane Williamson) రెండో స్థానానికి పడిపోయాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam) మూడో ర్యాంక్‌కు పరిమితమయ్యాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆరో స్థానానికి ఎగబాకాడు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja) టాప్‌లో కొనసాగుతున్నాడు.
టెస్టు బౌలర్ల జాబితాలో భారత బౌలర్లు టాప్‌లో నిలిచారు. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ల రవిచంద్రన్ అశ్విన్ టాప్ ర్యాంక్ నిలబెట్టుకోగా యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. ఆసీస్ స్పీడ్‌స్టర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న జడేజా బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానం సాధించాడు. ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన విండీస్ యువ పేసర్ జైడెన్ సీల్స్(jayden seales) 27వ ర్యాంక్‌కు ఎగబాకాడు.