Hardhik Pandya : టీ20 వరల్డ్ హీరో హార్దిక్ పాండ్యా (Hardhik Pandya) సుదీర్ఘ విశ్రాంతిలో ఉన్నాడు. వరల్డ్ కప్ తర్వాత శ్రీలంక సిరీస్‌లో పాండ్యా తేలిపోయాడు. పైగా టీమిండియా టీ20 కెప్టెన్సీ కూడా పోయింది. దాంతో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) సారథిగానూ అతడిపై వేటు పడనుందనే వార్తలు వినిపించాయి. అయితే.. ఆ వదంతుల్లో నిజం లేదని తెలుస్తోంది. అవును.. వచ్చే సీజన్‌లోనూ పాండ్యానే కెప్టెన్‌గా కొనసాగించాలని ముంబై ఫ్రాంచైజీ భావిస్తోంది. ఒక్క ఎడిషన్‌తోనే అతడిని తప్పించడం సరికాదని ముంబై యాజమాన్యం అనుకుంటోందని టాక్.
పదిహేడో సీజన్‌లో పాండ్యా ‘టాక్ ఆఫ్ ది ఐపీఎల్’గా నిలిచాడు. అందుకు కారణం.. అతడి ఆట కాదండోయ్.. గుజరాత్ టైటన్స్ (Gujarat Titans) నుంచి అతడు ముంబైకి మారాడమే. అంతే.. కెప్టెన్సీ మార్పు ఎంత పెద్ద దుమారం రేపిందో చూశాం. రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పగ్గాలు ఇవ్వడం ముంబై ఫ్యాన్స్‌కు నచ్చలేదు. దాంతో, పదిహేడో సీజన్ ఆసాంతం ఈ ఆల్‌రౌండర్ తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. టీ20ల్లో విధ్వంసక వీరుడిగా శిఖరాలకు చేరిన పాండ్యాను సొంత అభిమానులే చీదరించుకున్నారు.
కెప్టెన్సీ మార్పుపై ముంబై యాజమాన్యం, హెడ్‌కోచ్ మార్క్ బౌచర్‌లు సైతం వివరణ ఇచ్చినా పాండ్యాపై విషం కక్కడం మాత్రం ఆపలేదు. టాస్ కోసం, బ్యాటింగ్ కోసం పాండ్యా మైదానంలో దిగగానే అభిమానులు ‘రోహిత్.. రోహిత్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అలా.. ముంబై జట్టు తరఫున నాలుగు టైటిళ్లు గెలిచిన ఈ బరోడా క్రికెటర్.. ఈసారి అదే జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఒంటరి అయ్యాడు.
పాండ్యా 2015లో ముంబై జట్టులో చేరాడు. ఆరేండ్ల కాలంలో ముంబై తరఫున పాండ్యా నాలుగు టైటిళ్లు గెలిచాడు. తద్వారా ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన మూడో ఆటగాడిగా పాండ్యా రికార్డు సృష్టించాడు. రోహిత్ శర్మ(Rohit Sharma) ఆరు టైటిళ్లతో అగ్రస్థానంలో ఉండగా.. కీరన్ పోలార్డ్, అంబటి రాయుడు (Ambati Rayudu), పాండ్యాలు ఐదు ట్రోఫీలతో రెండో స్థానంలో నిలిచారు.
టీ20 వరల్డ్ కప్ తొమ్మిదో సీజన్‌తో పాండ్యా తన మనసును గాయపరిచిన ఎన్నో ప్రశ్నలకు.. అవమానాలకు.. నిద్రపట్టకుండా చూసిన రోజులకు సమాధానం వెతుక్కున్నాడు. 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఎంపికైన రోజు నుంచి టోర్నీ ముగిసే దాకా అతడు హేళనకు గురయ్యాడు. సొంత మైదానమైన వాంఖడే (Whankhede)లోనే అభిమానులు అతడిని గేలి చేశారు. ఆ ప్రభావం ఆటపై కూడా పడడంతో పాండ్యా మెప్పించలేకపోయాడు.
కానీ, టీమిండియా జెర్సీ వేసుకోగానే పాండ్యా ఆటే మారిపోయింది. అవును.. రెండు నెలల క్రితం పాండ్యా వేరు.. టీ20 వరల్డ్ కప్‌తో తిరొగొచ్చిన పాండ్యా వేరు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌గా అవమానాలు ఎదుర్కొన్న పాండ్యా.. ఇప్పుడు తనను గేలి చేసిన అభిమానులందరి మనుసు గెలుచుకున్నాడు. అందుకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో మార్మోగుతున్న హార్దిక్ హార్దిక్ నినాదాలే అందుకు సాక్ష్యం.
వరల్డ్ కప్ హీరోగా స్వదేశం వచ్చిన పాండ్యా వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందరూ ఊహించినట్టుగానే భార్య నటాషా స్టాంకోవిక్ (Natasha Stankovic)తో తెగతెంపులు చేసుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఏం రాసుకొచ్చాడంటే..? ‘నాలుగేండ్ల దాంపత్య జీవితం తర్వాత పరస్పర ఒప్పందంతో నటాషా, నేను విడాకులకు సిద్ధమయ్యాం. కలిసి బతికేందుకు ఎంతో ప్రయత్నించాం. కానీ, కుదరలేదు.
దాంతో, ఇద్దరి ప్రయోజనాల మేరకు విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు పుట్టిన అగస్త్య ఇక ముందు కూడా మా ఇద్దరి ప్రేమను పొందనున్నాడు. కో పేరెంట్‌గా అతడికి అన్ని సమకూర్చడమే కాకుండా, అతడిని సంతోషంగా ఉంచుతాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతకు భంగం కలిగించ వద్దని అభిమానులను కోరుతున్నా’ అని పాండ్యా వెల్లడించాడు.