GONGADI TRISHA | తెలంగాణ కా షాన్‌ త్రిష.. భారత క్రికెట్‌లో మారుమోగుతున్న భద్రాచలం అమ్మాయి పేరు!

Gongadi Trisha | గొంగడి త్రిష..ప్రస్తుత భారత క్రికెట్‌లో మారుమోగుతున్న తెలంగాణ అమ్మాయి పేరు! ఊహ తెలియని వయసులోనే క్రికెట్‌ బ్యాట్‌ చేతపట్టిన ఈ భద్రాచలం చిన్నది అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేస్తున్నది. మలేషియా వేదికగా జరిగిన ఐసీసీ అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలువడంలో త్రిషాది కీలక పాత్ర. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో బరిలోకి దిగే త్రిష.. తాను ఎదుర్కొన్న తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగడంలో దిట్ట అని చెప్పొచ్చు. మెగాటోర్నీలో ఏడు మ్యాచ్‌లాడిన ఈ యువ క్రికెటర్‌ 77.25 సగటుతో 309 పరుగులు సాధించింది.

వెస్టిండీస్‌తో మొదలై దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ వరకు త్రిష తనదైన శైలిలో ప్రతీ పోరులో సత్తాచాటింది. ఈ క్రమంలో ప్రత్యర్థులు నిర్దేశించిన స్వల్ప లక్ష్యఛేదనలోనూ తన మార్క్‌ బ్యాటింగ్‌తో జట్టును ముందుండి నడిపించింది. ఆడుతున్నది పేస్‌ అయినా.. స్పిన్‌ అయినా కళాత్మక షాట్లకు తోడు పవర్‌ఫుల్‌ హిట్టింగ్‌తో పరుగులు కొల్లగొట్టింది. స్కాట్లాండ్‌తో సూపర్‌సిక్స్‌ పోరులో అజేయ సెంచరీ(110*)తో కదంతొక్కింది. బౌలర్లను చెడుగుడు ఆడుకుంటూ మెగాటోర్నీ చరిత్రలో రికార్డు సెంచరీని తన పేరిట లిఖించుకుంది. ఇంగ్లండ్‌తో సెమీస్‌కు తోడు ఫైనల్లో సఫారీలపై సూపర్‌ఫామ్‌ కనబరుస్తూ భారత్‌కు రెండో ప్రపంచకప్‌ను అందించిన త్రిష..తెలంగాణ కా షాన్‌ అనడంలో అతిశయోక్తి లేదేమో!

2025-02-02T22:56:43Z