ఎడ్జ్‌బాస్టన్ టెస్టు నాలుగో రోజు టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. ఫస్ట్ సెషన్ డ్రింక్స్ బ్రేక్ ముందు కరుణ్ నాయర్ అవుటవ్వగా, డ్రింక్స్ బ్రేక్ తర్వాత సెటిల్ బ్యాటర్ కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. నాలుగో రోజు బౌలింగ్ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే జోష్ టంగ్ కేఎల్ రాహుల్ వికెట్ తీసుకున్నాడు. దాంతో టీమిండియా 126 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
64/1 పరుగులతో టీమిండియా నాలుగో రోజు ఆట ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు పరుగులకే అవుటయిన కేఎల్ రాహుల్, రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న కొద్ది సేపటికే జోష్ టంగ్ వేసిన లెంగ్త్ బాల్‌కు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ బంతి స్వింగ్ అయ్యి నేరుగా మిడ్ వికెట్‌కు తాకింది. దాంతో బేల్స్‌తో పాటు వికెట్ కూడా ఎగిరిపడింది.
ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ 84 బంతులు ఆడి పది ఫోర్లతో 54 పరుగులు చేసి అవుటయ్యాడు. మొదటి టెస్టులో కూడా సెంచరీ చేసిన రాహుల్, నిలకడగా ఆడుతూ ఈ సిరీస్‌లో టీమిండియాకు అండగా నిలబడ్డాడు. ఈ ఫిఫ్టీతో తన కెరీర్‌లో 18వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 9 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలతో టెస్టుల్లో 3493 పరుగులు చేశాడు.
జోష్ టంగ్ మొదటి బంతికే కేఎల్ రాహుల్‌ను క్లీన్ బౌల్డ్ చేయగా.. అదే ఓవర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన రిషబ్ పంత్ తన పంచ్ పవర్ చూయించాడు. వరుసగా ఫోర్, సిక్సర్‌తో తన సత్తా చూయించాడు. జోష్ టంగ్ వేసిన మరో ఓవర్‌లో కూడా పంత్ ఫోర్, సిక్సర్ బాదడం విశేషం. 35 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌లో 348 పరుగుల ఆధిక్యంలో ఉంది. గిల్ 22, పంత్ 34 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నారు.