ECB : ఇంగ్లండ్ వన్డే, టీ20 జట్లకు కొత్త హెడ్‌కోచ్ ఎవరు? అనే ప్రశ్నకు తెరపడింది. మాథ్యూ మ్యాట్ రాజీనామాతో పలువురు పేర్లు తెరపైకి వచ్చినా చివరకూ అందరూ ఊహించినట్టే.. టెస్టు కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్(Brendon McCullum) వన్డే టీమ్‌కు ప్రధాన కోచ్ కానున్నాడు. అవును.. ఇకపై మూడు ఫార్మాట్లకు అతడు ఇంగ్లండ్‌కు దిశానిర్దేశం చేయనున్నాడు. మంగళవారం ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు తమ కొత్త వైట్ బాల్ కోచ్‌గా మెక్‌కల్లమ్‌ను పరిచయం చేశాయి.
ఇప్పటికే ‘బజ్‌బాల్’ (Bazz Ball) ఆటతో సుదీర్ఘ ఫార్మాట్‌లో అలజడి సృష్టించిన మెక్‌కల్లమ్ ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్‌లో ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలి. అయితే.. ఇప్పుడే కాదు.. వచ్చే ఏడాది జనవరి నుంచి అతడు మూడు ఫార్మాట్ల కోచ్‌గా కొనసాగనున్నాడు. అప్పటిదాకా మాజీ కెప్టెన్ మార్క్ ట్రెస్కోథిక్(Marcus Trescothick) వైట్ బాల్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.
ఇంగ్లండ్ వైట్ బాల్ కోచ్‌గానూ ఎంపికవ్వడంపై మెక్‌కల్లమ్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఇప్పటివరకూ ఇంగ్లండ్ టెస్టు కోచ్ పదవిని ఎంతో ఆస్వాదించాను. ఇకపై వైట్ బాల్ కోచ్‌గా పనిచేయడం ఉత్సాహంగా అనిపిస్తోంది. ఈ కొత్త సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. జోస్ బట్లర్, జట్టుతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఇంగ్లండ్ జట్టును మరింత బలోపేతం చేయడమే నా లక్ష్యం’ అని మెక్‌కల్లమ్ తెలిపాడు.
కెప్టెన్ బట్లర్‌తో మ్యాట్
టీ20 వరల్డ్ కప్‌లో ఇంగ్లండ్ వైఫల్యం అందర్నీ షాక్‌కు గురి చేసింది. డిఫెండింగ్ చాంపియన్ జోస్ బట్లర్ సేన్ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టడంతో హెడ్‌కోచ్ మాథ్యూ మ్యాట్(Mathew Mott)పై వేటు పడింది. ఆ పోస్ట్ ఖాళీగా అవడంతో.. శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర Kumar Sangakkara, ఆసీస్ మాజీ ఆటగాడు జస్టిన్ లాంగర్‌లు రేసులు ఉన్నారనే వార్తలు వినిపించాయి.
కానీ, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మార్క్ ట్రెస్కోథిక్ మధ్యంతర కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే.. పూర్తి స్థాయి కోచ్ అవసరం తప్పనిసరి అని భావించిన ఈసీబీ టెస్టుల్లో హిట్ అయిన మెక్‌కల్లమ్ వైపే మొగ్గు చూపింది. అతడికే వన్డే, టీ20 కోచ్ కట్టబెట్టాలని నిర్ణయించుకుంది.
న్యూజిలాండ్ ఓపెనర్‌గా మెక్‌కల్లమ్ ఎన్నో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఆ తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లోనే శతకం బాదిన అతను 2022లో ఇంగ్లండ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఆ సమయానికి ఆ జట్టు టెస్టుల్లో వరుస ఓటములను చవిచూస్తోంది. అలాంటి జట్టును ఒక్క ఏడాదిలోనే మెక్‌కల్లమ్ మార్చేశాడు. తన స్టయిల్ విధ్వంసక ఆటను జట్టుకు ఒంటబట్టించాడు.
స్ట్రోక్ ప్లేతో అలరించే బెన్ స్టోక్స్ (Ben Stokes) కెప్టెన్ అయ్యాక అతడి పని మరింత సులువైంది. మెక్‌కల్లమ్‌ను అభిమానులు ముద్దుగా ‘బాజ్’ అని పిలుస్తారు. దాంతో, అతను నేర్పిన ఆటకు ‘బాజ్‌బాల్'(Bazzball) అనే పేరు ప్రచారంలోకి వచ్చింది. గత ఏడాది నుంచి ఇంగ్లండ్ టెస్టుల్లో అదరగొడుతోంది. పాకిస్థాన్ పర్యటనలో స్టోక్స్ సేన మూడు టెస్టులు నెగ్గి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత స్వదేశంలో ఐర్లాండ్(Ireland)తో జరిగిన ఏకైక టెస్టులోనూ సంచలన విజయం సాధించింది.